డిసెంబర్ 31 వరకే పాత ధరలు: Triumph 400cc బైక్‌ల ధరలు పెంపు
ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, 2026 జనవరి 1 నుంచి ధరలు పెంచనుంది. డిసెంబర్ 31 వరకు పాత ధరలే వర్తిస్తాయి. 400 సీసీ మోడళ్ల రేట్లు కొన్ని వేల రూపాయలు పెరిగాయి.

Triumph Motorcycles India Price Hike: భారత మార్కెట్‌లో ప్రీమియం మోటార్‌సైకిల్ విభాగంలో మంచి గుర్తింపు సంపాదించిన ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ కీలక ప్రకటన చేసింది. కంపెనీ అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని మోడళ్ల ఎక్స్-షోరూమ్ ధరలు 2025 డిసెంబర్ 31 వరకు మారకుండా కొనసాగుతాయి. అయితే, 2026 జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా ట్రయంఫ్ బైక్‌ల ధరలు పెరగనున్నాయి.
ఇటీవల, 350 సీసీకి పైబడిన మోటార్‌సైకిళ్లపై GST స్లాబ్ మార్పు జరిగింది. దీనివల్ల తయారీదారులపై అదనపు భారం పడినా, ట్రయంఫ్ మాత్రం వెంటనే ధరలు పెంచకుండా ఆ భారాన్ని తామే భరించింది. కస్టమర్లకు ఖర్చు పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో కంపెనీ ముందుకు సాగింది. అయితే, కొత్త సంవత్సరం నుంచి ధరల సవరణ తప్పదనే సంకేతాన్ని ఇప్పుడు స్పష్టంగా ఇచ్చింది.
ట్రయంఫ్ 400 సీసీ బైక్‌లకు కొత్త ధరలు
భారత్‌లో ట్రయంఫ్‌కు అత్యధిక అమ్మకాలు తీసుకొచ్చినవి 400 సీసీ మోటార్‌సైకిళ్లే. ఇవి బజాజ్ ఆటోతో భాగస్వామ్యంలో దేశీయంగా తయారవుతున్నాయి. 2026 జనవరి 1 నుంచి ఈ అన్ని మోడళ్లపై రూ.8,000 వరకు ధర పెంపు అమలులోకి రానుంది.
ప్రస్తుతం స్పీడ్ T4 ధర రూ.1.92 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. కొత్త సంవత్సరం నుంచి ఇది రూ.2.00 లక్షలకు చేరుతుంది. అలాగే స్పీడ్ 400 ధర రూ.2.33 లక్షల నుంచి రూ.2.41 లక్షలకు పెరుగుతుంది. అడ్వెంచర్ స్టైల్‌ను ఇష్టపడే రైడర్లకు నచ్చిన స్క్రాంబ్లర్ 400 X ధర రూ.2.75 లక్షలుగా మారనుంది. రెట్రో డిజైన్‌తో ఆకట్టుకునే త్రక్స్టన్ 400 కొత్త ధర రూ.2.82 లక్షలు కాగా, టాప్ మోడల్ అయిన స్క్రాంబ్లర్ 400 XC ధర రూ.3.02 లక్షలకు చేరనుంది.
ట్రయంఫ్ 400 cc మోటార్ సైకిళ్ల కొత్త ధరలు
| మోడల్ | ప్రస్తుత ధర (రూ.) | పెంపు (రూ.) | జనవరి 1 నుంచి కొత్త ధర (రూ.) |
|---|---|---|---|
| Speed T4 | 1,92,539 | 8,000 | 2,00,539 |
| Speed 400 | 2,33,754 | 8,000 | 2,41,754 |
| Scrambler 400 X | 2,67,731 | 8,000 | 2,75,731 |
| Thruxton 400 | 2,74,137 | 8,000 | 2,82,137 |
| Scrambler 400 XC | 2,94,671 | 8,000 | 3,02,671 |
డీలర్ వర్గాల సమాచారం ప్రకారం, ఎక్స్-షోరూమ్ ధర పెరుగుదలతో పాటు ఆన్-రోడ్ ధరలు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రం, RTO ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఆధారంగా ఈ తేడా ఉంటుంది.
ఇదే సమయంలో, కంపెనీ స్పెషల్ ఫెస్టివ్ ప్రైస్ ఆఫర్లను కూడా కొన్ని మోడళ్లపై అందుబాటులోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా స్పీడ్ 400, స్పీడ్ T4 మోడళ్లు ట్రయంఫ్ బ్రాండ్‌కు కొత్త కస్టమర్లను దగ్గర చేశాయి. ప్రీమియం బైక్ అనుభవాన్ని తక్కువ ధరలో అందించడం ఈ మోడళ్ల విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది.
పెద్ద బైక్‌ల ధరలపై ఇంకా స్పష్టత లేదు
ప్రస్తుతం ఈ ధరల పెంపు వివరాలు 400 సీసీ మోడళ్ల వరకే పరిమితమయ్యాయి. టైగర్ సిరీస్ టూరర్లు, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, బోన్నివిల్, ట్రైడెంట్, డేటోనా, రాకెట్ 3 వంటి పెద్ద బైక్‌ల ధరలు ఎంతవరకు పెరుగుతాయన్న దానిపై కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వచ్చే నెలల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ట్రయంఫ్ బైక్ కొనాలనుకునే వారికి డిసెంబర్ నెల కీలకం. ధరలు పెరగకముందే నిర్ణయం తీసుకుంటే వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















