Maruti Suzuki: కార్ల మార్కెట్లో దూసుకుపోతున్న మారుతి - గతేడాది ఆల్ టైమ్ రికార్డు సేల్స్!
Maruti Suzuki Reocrd Sales: మారుతి సుజుకి కార్ల మార్కెట్లో దూసుకుపోతుంది.
Maruti Suzuki Sales Report: 2023-24 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 21,35,323 అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. దీంతో మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో దేశీయ విక్రయాలు 1,793,644 యూనిట్లు, ఎగుమతులు 283,067 యూనిట్లు ఉన్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ మారుతి సుజుకినే నంబర్ వన్‌గా ఉంది. దీంతో పాటు మార్కెట్ కొత్త పోకడలు తొక్కింది. ఎస్‌యూవీ విభాగంలో సేల్స్ పెరగ్గా, హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల ప్రజాదరణ క్షీణించడం మొదలైంది.
మారుతి సుజుకిలో అమ్మకాల పరంగా వ్యాగన్ ఆర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ, 2023తో పోల్చితే 2024లో కాంపాక్ట్ సెగ్మెంట్ స్వల్పంగా క్షీణించింది. 2023 గ్రాండ్ విటారా, బ్రెజ్జా (Maruti Suzuki Brezza), ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx), ఇతర కార్ల కారణంగా ఎస్‌యూవీల విక్రయాలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. దీంతోపాటు యుటిలిటీ వాహనాల విక్రయాలు భారీగా పెరుగుతాయని అంచనా.
ఎస్‌యూవీ విభాగంలో పెరిగిన షేర్
మారుతీ సుజుకి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు శశాంక్ శ్రీవాస్తవ షేర్ చేసిన వివరాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో అమ్మకాల వృద్ధి... పట్టణ ప్రాంతాల్లో వృద్ధిని అధిగమించింది. ఎస్‌యూవీ విభాగంలో మారుతి సుజుకి మార్కెట్ వాటా కూడా 21 శాతానికి పెరిగింది. మరోవైపు డీజిల్ కార్ల అమ్మకాలు క్షీణించాయి. అయితే సీఎన్‌జీ స్పేస్ కూడా వృద్ధిని సాధించింది. ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ స్పేస్‌లో హైబ్రిడ్ కార్లు ఏకంగా ఈవీలను అధిగమించాయి. అయితే మారుతి సుజుకి ప్రస్తుతం ఇన్విక్టో (Maruti Suzuki Invicto), గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) వంటి బలమైన హైబ్రిడ్ కార్లను కలిగి ఉంది. తన మొదటి ఎలక్ట్రిక్ కారును అయిన మారుతి సుజుకి ఈవీఎక్స్‌ను త్వరలో విడుదల చేయనుంది.
భారతీయ కార్ మార్కెట్ అమ్మకాల పరంగా జపాన్‌ను అధిగమించింది. ఎస్‌యూవీ స్టైలింగ్ ఒక ప్రధాన విభాగంగా ఉంది. ఎంపీవీలు కూడా పెద్ద వృద్ధిని సాధించాయి. సెడాన్లు, హ్యాచ్‌బ్యాక్‌ల అమ్మకాలు క్షీణించాయి. దీంతో ఎస్‌యూవీలు, ఎంపీవీలు ప్రముఖ ఆప్షన్లుగా ఉద్భవించాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో ఎర్టిగాకు నాలుగు నెలల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉన్న మారుతి సుజుకి కారుగా ఇదే నిలిచింది. గ్రాండ్ విటారా వంటి ప్రముఖ ఎస్‌యూవీలు కూడా ఎక్కువ వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉన్నాయి.
కంపెనీ ప్లాన్ ఇదే...
శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ 2030 నాటికి మారుతి సుజుకి ఉత్పత్తుల్లో 15 శాతం ఈవీ, 25 శాతం హైబ్రిడ్‌గా ఉంటుందని, మిగిలిన ఉత్పత్తి శ్రేణిలో పెట్రోల్, సీఎన్‌జీ ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. మారుతీ సుజుకి ఇటీవలే నాయకత్వ మార్పులను ప్రకటించింది. దీనిలో సీవీ రామన్, శశాంక్ శ్రీవాస్తవ వారి మునుపటి పాత్రల నుండి 'మెంబర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ'కి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఇంతకుముందు సర్వీసెస్ హెడ్‌గా ఉన్న పార్థో బెనర్జీ ఇప్పుడు మార్కెటింగ్, సేల్స్‌కు హెడ్‌గా ఉన్నారు. సందీప్ రైనా ఇప్పుడు ప్రొడక్ట్ స్కీమ్ చీఫ్‌గా ఉన్నారు.