స్పీడ్ ప్రియుల కోసం కొత్తగా వచ్చిన KTM 160 Duke – క్లాస్, మాస్ కలిపిన పవర్‌ఫుల్ బైక్
KTM 160 Duke Features: డిజైన్ పరంగా, 160 డ్యూక్ రెండో తరం 200 డ్యూక్ లాగానే ఉంటుంది. అయితే, దీనికి ప్రత్యేకమైన రంగులు, మరియు ప్రత్యేక గ్రాఫిక్స్ ఉంటాయి.

KTM 160 Duke Price, Mileage And Features In Telugu: యువతలో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తూ, కేటీఎం 160 డ్యూక్ అధికారికంగా లాంచ్ అయింది. ఇది, KTM సిరీస్‌లో అత్యంత చౌకైన ఎంట్రీ లెవల్ బైక్. ఇటీవల విడుదల చేసిన టీజర్లతో ఈ బైక్‌పై ఆసక్తిని పెంచిన కంపెనీ... ఇప్పుడు, ఈ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడం ద్వారా 160 cc సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. 125 cc మోడల్ ఉత్పత్తి నిలిపివేయడంతో, ఈ కొత్త వెర్షన్ మరింత మంది కస్టమర్లను ఆకర్షించనుంది. స్పీడ్‌కి ప్రాధాన్యం ఇచ్చే యువ రైడర్లను లక్ష్యంగా పెట్టుకుని ఈ మోడల్‌ను రూపొందించారు.
ధర & కలర్స్
కేటీఎమ్ 160 డ్యూక్ ఎక్స్-షోరూమ్ ధర ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో రూ. 1,84,998. ఈ బైక్ మూడు కలర్ స్కీమ్స్‌లో లభిస్తుంది — ఎలక్ట్రానిక్ ఆరెంజ్, అట్లాంటిక్ బ్లూ, సిల్వర్ మెటాలిక్ మ్యాట్. బుకింగ్స్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో & దేశవ్యాప్తంగా ఉన్న కేటీఎం డీలర్‌షిప్‌లలో ప్రారంభమయ్యాయి.
ఇంజిన్ & పనితీరు
ఈ నేకెడ్ స్ట్రీట్‌ఫైటర్ 164.2 cc, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పవర్ తీసుకుంటుంది. ఇది 9,500 RPM వద్ద గరిష్టంగా 19 PS పవర్, 7,500 RPM వద్ద 15.5 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ పనితీరు దీన్ని తన క్లాస్‌లోనే అత్యంత శక్తిమంతమైన బైక్‌గా నిలబెడుతుంది. ఈ ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ అటాచ్ చేశారు, ఇది రైడింగ్‌లో థ్రిల్ ఇస్తుంది. ఈ బండిలో స్లిప్పర్ & అసిస్ట్ క్లచ్ స్టాండర్డ్‌గా లభిస్తాయి.
రైడింగ్ & హ్యాండ్లింగ్
కేటీఎమ్, 160 డ్యూక్ కోసం ప్రత్యేక స్ప్లిట్ ట్రెలిస్ ఫ్రేమ్, WP Apex USD ఫ్రంట్ ఫోర్క్స్, హల్లో యాక్సిల్, బయానిక్ లైట్ వీల్స్ & తేలికైన హగ్గర్ ట్యూబ్ వంటివి ఉపయోగించింది. వీటి కారణంగా బైక్ బరువు తగ్గి చురుకైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తుంది. బ్రేకింగ్ కోసం 320 mm ఫ్రంట్ డిస్క్, 230 mm రియర్ డిస్క్ ఉన్నాయి. డ్యూయల్-చానల్ ABS కూడా స్టాండర్డ్ ఫిట్‌మెంట్‌గా వస్తుంది.
టెక్నాలజీ & ఫీచర్స్
ఈ బైక్‌లో 5 అంగుళాల LCD డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్ & మ్యూజిక్ కంట్రోల్ వంటి మోడరన్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. పనితీరు, ప్రిసిషన్, అటిట్యూడ్‌ను కోల్పోకుండా, KTM DNAని ప్రతిబింబించేలా, మరింత యాక్సెసిబుల్‌గా ఈ మోడల్‌ను తయారు చేశారు.
పోటీ & భవిష్యత్తు మోడల్స్
KTM 160 Duke ప్రధానంగా Yamaha MT-15 V2తో పోటీ పడుతుంది. యమహా MT-15 V2 బైక్‌తో పోలేస్తే, ఫీచర్ల పరంగా KTM 160 Duke మరింత ఆధునికంగా నిలుస్తుంది. త్వరలో దీని ఫెయిర్డ్ వెర్షన్ అయిన KTM 160 RC కూడా రాబోతోంది. అది Yamaha R15 V4తో పోటీ పడనుంది.
తన క్లాస్‌లోనే శక్తిమంతమైన పనితీరు, ఆధునిక ఫీచర్లు, అద్భుతమైన డిజైన్‌తో KTM 160 Duke యువతకు కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది. స్పీడ్, స్టైల్, టెక్నాలజీ - అన్నింటినీ సమపాళ్లలో మేళవించిన ప్యాకేజ్ కావాలనుకునే వారికి ఇది ఓ సరైన ఎంపిక.



















