ఆసియా కప్ హీరో అభిషేక్ శర్మకు వచ్చిన గిఫ్ట్ HAVAL H9 ని భారత్‌లో డ్రైవ్ చేయలేడు, ఎందుకంటే?
ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ టైటిల్ గెలుచుకున్న అభిషేక్ శర్మకు HAVAL H9 SUV బహుమతిగా లభించింది. ఇప్పుడు, కొత్త వార్త ఏమిటంటే అభిషేక్ శర్మ ఈ కారును భారతదేశానికి తీసుకురాలేడు, నడపలేడు.

Abhishek Sharma Haval H9 SUV News: 2025 ఆసియా కప్‌లో భారతదేశం సాధించిన అద్భుతమైన విజయానికి చాలా మంది ఆటగాళ్లు కారణమని చెప్పవచ్చు. అయితే, అందరి కంటే ఎక్కువగా చర్చల్లోకి వచ్చిన ప్లేయర్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన అతను, 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్' అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కింద అభిషేక్ శర్మకు HAVAL H9 SUVని బహుమతిగా ఇచ్చారు. ఇప్పుడు కొత్త వార్త ఏంటంటే, చట్టపరమైన సమస్యల కారణంగా అభిషేక్ శర్మ ఈ కారును భారతదేశానికి తీసుకురాలేడు & నడపలేడు.
HAVAL H9 SUV ఎడమ చేతి డ్రైవ్ వెర్షన్ SUV (స్టీరింగ్ వీల్ కారుకు ఎడమ వైపున ఉంటుంది). భారతదేశ చట్టాల ప్రకారం కుడి చేతి డ్రైవ్ వాహనాలకు, అంటే స్టీరింగ్ వీల్ కుడి వైపున ఉన్న కార్లకు మాత్రమే అనుమతి ఉంది. భారతదేశ రోడ్డు భద్రత & వాహన రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం, లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను భారతదేశంలో రిజిస్టర్ చేయడం లేదా నడపడం సాధ్యం కాదు. అందువల్ల, అభిషేక్ శర్మ ఈ SUVని భారతదేశానికి తీసుకురాలేడు.
అభిషేక్ శర్మకి ప్రత్యామ్నాయ కారు దొరుకుతుందా?
నివేదికల ప్రకారం, HAVAL ఈ SUV ని నవంబర్ 2025 నాటికి భారతదేశంలో రైట్ హ్యాండ్ డ్రైవ్ వెర్షన్‌లో విడుదల చేయవచ్చు. ఇది జరిగితే, అభిషేక్ శర్మకు ఇండియా-స్పెక్ మోడల్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే, కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
HAVAL H9 స్పెషాలిటీలు ఏంటి?
విలాసవంతమైన రూపం & అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో HAVAL H9 చాలా ఆకట్టుకుంటుంది. ఈ వాహనంలో భద్రత & సౌకర్యంలో ఏమాత్రం రాజీ పడలేదు. 7-సీట్ల లేఅవుట్‌ను ఈ కారులో ఉంది. ఇవన్నీ లెదర్ సీట్లు & వాటిని ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయవచ్చు. ఆపిల్ కార్‌ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ & పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీల కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగులు , పార్కింగ్ అసిస్ట్ & ABS / EBD వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి.
కారు ధర ఎంత?
HAVAL H9 భారత మార్కెట్‌లో అమ్మడం లేదు, కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అమ్ముతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర 1,42,200 సౌదీ రియాల్స్ (SAR 1,42,200). ఈ ధర భారత కరెన్సీలో సుమారు 33.60 లక్షలకు సమానం. నివేదికల ప్రకారం, భారతదేశంలో ఈ వాహనం అంచనా ధర రూ. 25 లక్షల నుంచి రూ. 30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు.
HAVAL H9 SUV టయోటా ఫార్చ్యూనర్ వంటి వాహనాలకు కాంపిటీషన్ ఇస్తుంది.





















