Sajjala: టీడీపీ కంచుకోట బద్దలవుతుంది... దొంగ ఓట్ల సంస్కృతి వైసీపీకి లేదు... చంద్రబాబుకు సజ్జల కౌంటర్
దొంగ ఓట్లు వేయించుకునే అలవాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి లేదని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తున్నారన్నారు. ఈసారి కుప్పంలో టీడీపీ కోట బద్దలవుతుందన్నారు.
చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో దొంగఓట్లు వేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దొంగ ఓట్లు వేయించుకునే అలవాటు వైసీపీ లేదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. కుప్పంలో పోలింగ్ సజావుగా జరిగిందని, ఎక్కడా దొంగ ఓట్లు వేయలేదన్నారు. ఒకవేళ దొంగ ఓట్లు వేస్తుంటే టీడీపీ ఏజెంట్లు ఏంచేస్తున్నారని సజ్జల ప్రశ్నించారు. కుప్పంలో స్థానికేతరులు ఉన్నారన్న చంద్రబాబు ఆరోపణలు సజ్జల ఖండించారు. స్థానికేతరులతో ఎవరు ఓటేయిస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. సీఎం జగన్ ప్రజలు మద్దతుగా ఉంటారని సజ్జల వ్యాఖ్యానించారు.
Also Read: అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !
చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోతుంది
కుప్పంలో జరుగుతున్న ఎన్నికలను చంద్రబాబు జనరల్ ఎన్నికల మాదిరిగా మాట్లాడుతున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కుప్పంలో 37 వేల ఓటర్లకు టీడీపీ హడావుడి చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబును 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా భరించినందుకు బాధ కలుగుతుందన్నారు. టీడీపీ, జనసేన ఒకే తాను గుడ్డలని ఎద్దేవా చేశారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి భారీ మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుప్పం నియోజకవర్గంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. ఇన్నాళ్లు చంద్రబాబు చేతుల్లో కుప్పం మగ్గిపోయిందన్నారు. బయట ఓటర్లను తీసుకొచ్చే అలవాటు చంద్రబాబుకు ఉందన్నారు.
Also Read: రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం... ప్రజావ్యతిరేకత తట్టుకోలేక కుట్రలు... వైసీపీపై చంద్రబాబు ఫైర్
కుప్పం కోట బద్దలు..!
స్థానిక ఎన్నికల్లో తొలిసారి కుప్పం కోట బద్దలవుతుందని సజ్జల అన్నారు. జగన్ ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని ప్రజలంతా చూస్తున్నారన్నారు. ఈ విషయం కుప్పం టౌన్‌లో రిపీట్ అయ్యే అవకాశం ఉందన్నారు. ఫలితాలు అలా రాకపోయినా వైసీపీ ప్రభుత్వానికి ఏమీ కాదన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలిపి టీడీపీ ఇలానే చేసిందన్నారు. పోలింగ్ బూత్‌లో టీడీపీ ఏజెంట్‌లు ఉన్నప్పుడు దొంగ ఓట్లు ఎలా వేస్తారని ప్రశ్నించారు. కుప్పంలో ఏం జరిగినా చంద్రబాబు ఖాతాలోకే వస్తుందని సజ్జల ఆరోపించారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని వీడియోలు విడుదల చేశారు.
Also Read: కుప్పంలో రచ్చ - మిగతా చోట్ల చెదురుమదురు ఘటనలు .. ముగిసిన ఏపీ మినీ లోకల్ వార్ !