Poll Fight : కుప్పంలో రచ్చ - మిగతా చోట్ల చెదురుమదురు ఘటనలు .. ముగిసిన ఏపీ మినీ లోకల్ వార్ !
ఏపీలో మినీ స్థానిక ఎన్నికలు ఉద్రిక్తంగా ముగిశాయి. పలు చోట్ల దొంగ ఓటర్ల కలకలం రేగింది. కుప్పంలో రోజంతా ఉద్రిక్తంగానే పోలింగ్ సాగింది.
ఆంధ్రప్రదేశ్‌లో మినీ స్థానిక సమరం పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల మధ్య ముగిసింది. నెల్లూరు కార్పొరేషన్ సహా 12 నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అనేక చోట్ల దొంగ ఓటర్లు పెద్ద ఎత్తున రావడం.. వారిని అడ్డుకునేందుకు ఇతర పార్టీలు ప్రయత్నించడంతో ఘర్షణలు జరిగాయి. ప్రధానంగా ఎప్పుడూ ఎన్నికలు ప్రశాంతంగా జరిగే కుప్పంలో ఈసారి రోజంతా తీవ్ర ఉద్రిక్తతకు కారణం అయింది.
కుప్పంలో రచ్చ రచ్చ !
టీడీపీ అధినేత ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం నగర పంచాయతీకి జరిగిన పోలింగ్ రోజంతా ఉద్రిక్తతల మధ్య సాగింది. ఉదయం నుంచి టీడీపీ శ్రేణులు దొంగ ఓటర్లను గుర్తించి ఆందోళన చేస్తూనే ఉన్నారు. గుంపులుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని పట్టుకున్న చోట ఉద్రిక్తత ఏర్పడింది. వారిపై టీడీపీ నేతలు దాడులు చేయడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. కుప్పం మార్కెట్ సెంటర్‌లో తమిళనాడు నుంచి వస్తున్న ఓ బస్సును టీడీపీ నేతలు ఆపి అద్దాలు పగులగొట్టారు. అందులో ఉన్న వారంతా దొంగ ఓటర్లని ఆరోపించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేసి తరిమేశారు. తర్వాత విజయవాణి స్కూల్లో ఉన్న దొంగ ఓటర్లు ఉన్నారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. లోపలికి వెళ్లి ఉన్న వారిని పోలీసులకు చూపించారు. అక్కడ ఉన్నవారంతా వారి మొహాలను దాచుకునే ప్రయత్నం చేయడంతో వారంతా దొంగఓటర్లుగా అనుమానించారు. పలువురు దొంగ ఓటర్లను పోలీసులుపట్టుకుని వెళారు. సాయంత్రం సమయంలో పోలింగ్ మరో రెండు గంటల్లో ముగియనున్న సమయంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలని కార్యకర్తలు అడ్డుకోవడంతో .. లాఠీచార్జ్ చేసి తీసుకెళ్లారు. కొన్ని వార్డుల వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎప్పుడూ లేని విధంగా కుప్పంలో ఈ సారి ఉద్రిక్తతలు ఏర్పడటంతో స్థానికులు కూడా ఆందోళనకు గురయ్యారు.
విశాఖలో జనసేన వర్సెస్ వైసీపీ !
విశాఖలో రెండు కార్పొరేటర్ స్థానాలకు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు చనిపోయారు. ఈ కారణంగా ఉపఎన్నికలు జరుగుతున్నాయి. అయితే చనిపోయిన కుటుంబసభ్యులకే చాన్సివ్వాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆ మేరకు 31వ డివిజన్‌లో వైఎస్ఆర్‌సీపీ, 61వ డివిజన్‌లో టీడీపీ పోటీ పెట్టకూడదని అనుకున్నాయి. దానికి తగ్గట్లుగా 61వ డివిజన్‌లో టీడీపీ నామినేషన్ వేయలేదు. 31వ డివిజన్‌లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి పోటీలో లేరు కానీ చివరి క్షణంలో టీడీపీకి షాక్ ఇచ్చిన వైఎస్ఆర్‌సీపీ నేతలు ఇండిపెండెంట్ అభ్యర్థికి బీఫాం ఇచ్చి అధికారిక అభ్యర్థిని చేశారు. అయితే టీడీపీ బరిలో లేనప్పటికి 61వ డివిజన్‌లో జనసేన పార్టీ బరిలో ఉంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని టీడీపీ శ్రేణులు కూడా జనసేనకు మద్దతు ఇచ్చాయి. ఈ క్రమంలో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుండి 61వ డివిజన్‌లో వైఎస్ఆర్‌సీపీ, జనసేన శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పలు మార్లు దాడులకు దిగారు. చివరికి పోలింగ్ పరిశీలనకు వచ్చిన విజయసాయిరెడ్డిపై జనసేన శ్రేణులు విరుచుకుపడ్డాయి. అలా ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం వివాదాస్పదం అయింది. ఉమెన్స్ కాలేజీ పోలింగ్ బూత్ దగ్గర పరస్పరం ఘర్షణ పడ్డారు.
పల్నాడులో ఉద్రిక్తతల మధ్య పోలింగ్ !
గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. విపక్ష పార్టీ నేతలు అక్కడ పోటీ చేయడమే కష్టమనుకున్న పరిస్థితుల్లోపోలింగ్ భయం భయంగా సాగింది. అక్కడ అభ్యర్థులు ముందుగానే హైకోర్టును ఆశ్రయించారు. పూర్తి స్థాయి భద్రత కల్పించేలా హైకోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినప్పటికీ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కడప జిల్లా రాజంపేట, కమలాపురం నగర పంచాయతీలకూ ఎన్నికలు జరిగాయి. కొన్ని బూత్‌లలో ఏకపక్షంగా పోలింగ్ నిర్వహించునేందుకు ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో రెండు బూత్‌లలో సీసీ కెమెరాలు ఆపేయించి రిగ్గింగ్‌కు ప్రయత్నించినట్లుగా ఎమ్మెల్యేపై ఆరోపణలు వచ్చాయి.
నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఉద్రిక్తత!
అధికార, ప్రతిపక్ష పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నెల్లూరు కార్పొరేషన్‌లోనూ పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష నేతల పోలింగ్ఏజెంట్లను బయటకు పంపి .. దొంగ ఓట్లు వేయించుకునేందుకు ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 14వ వార్డు పోలింగ్ కేంద్రం వద్ద కొంత సేపుఉద్రిక్త ఏర్పడింది. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లకు చెప్పడం వివాదాస్పదంగా మారింది. గొడవకు సంబంధం లేని టీడీపీ అభ్యర్థిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇతర చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం!
ఇతర చోట్ల జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఉపఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏలూరులో ఓ వార్డు స్థానానికి ఉపఎన్నిక జరుగుతూంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తి ఇట్లో నేరుగా డబ్బులు పంచడం వివాదాస్పదమయింది. పోలింగ్ ప్రక్రియలో పోలీసులు అధికార పార్టీ నేతలకు పూర్తి స్థాయిలో కొమ్ము కాయడం వివాదాస్పదమయింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి