AP Highcourt Amaravati : అమరావతి పిటిషన్లపై హైకోర్టులో విచారణ ... ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలన్న ఏపీ ప్రభుత్వ లాయర్లు !
అమరావతి పిటిషన్లు విచారణ జరుపుతున్న ధర్మాసనంలోఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. అయితే రాజధాని పిటిషన్లకు ఎంతో ప్రాముఖ్యం ఉందని ఆలస్యం చేయబోమని సీజే తోసిపుచ్చారు.
అమరావతి పిటిషన్లను త్వరగా పరిష్కరిస్తామని హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మానసం వ్యాఖ్యానించింది. చాలా రోజుల తర్వాత హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ప్రారంభమయింది. చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రభుత్వం తమతో చేసుకున్న ఒప్పందాల్ని ఉల్లంఘించి... తెచ్చిన మూడు రాజధానుల బిల్లులు, సీఆర్డీఏ రద్దును సవాల్ చేస్తూ రైతులు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే విచారణ ప్రారంభం కాగానే ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తుల్ని తప్పించాలని ప్రభుత్వ న్యాయవాదులు కోరారు. ఈ విజ్ఞప్తిని ధర్మాసనం తోసి పుచ్చింది.
రాజధాని కేసుల విచారణకు ప్రాముఖ్యం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా నిలిచిపోయినట్లు అనిపిస్తోందని ... పిటిషనర్లతో పాటు అందరూ ఇబ్బంది పడుతున్నారని త్వరగా పిటిషన్లను పరిష్కరిస్తామని సీజే వ్యాఖ్యానించారు. నిజానికి రైతులు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ చివరి దశలోఉన్నప్పుడు హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ జే.కే.మహేశ్వరి బదిలీ అయ్యారు. ఈ కారణంగా వాదనలు నిలిచిపోయాయి. కొత్త సీజే నేతృత్వంలో మళ్లీ మొదటి నుంచి వాదనలు జరగాల్సి ఉంది.
అయితే కరోనా కారణంగా అటు ప్రభుత్వం.. ఇటు పిటిషనర్లు కూడా వాయిదాలు కోరుకోవడంతో జస్టిస్ జే.కే మహేశ్వరి తర్వాత వచ్చిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలో కూడా విచారణ సాగలేదు. ఈ నవంబర్‌లో విచారణ చేయాలని గతంలో నిర్ణయించారు. ఈ మేరకు హైకోర్టులో విచారణ ప్రారంభం అయింది. ప్రస్తుతం అమరావతి పిటిషన్లు హైబ్రీడ్ విధానంలో విచారణ జరుగుతోంది. కొంత మంది లాయర్లు ప్రత్యక్షంగా.. మరికొంత మంది ఆన్ లైన్ పద్దతిలో వాదనలు వినిపిస్తారు.
ప్రభుత్వం మూడు రాజధానుల వాదనను తెరపైకి తీసుకు రావడంతో విషయం న్యాయవ్యవస్థ ముంగిటకు వెళ్లింది. దీంతో అటు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌లో పనులు జరగడం లేదు. ఇటు అమరావతి పనులు చేయడం లేదు. అమరావతిలో మిగిలిపోయిన పనులు చేయిస్తామని ప్రభుత్వం చాలా సార్లు ప్రకటించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు హైకోర్టు సీజే త్వరగా రాజధాని బిల్లులను పరిష్కరిస్తామని చెప్పడంతో త్వరగా విచారణ ముగుస్తుందని అందరూ భావిస్తున్నారు.
Also Read: దావోస్‌కు సీఎం జగన్ ! వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఆహ్వానాన్ని మన్నిస్తారా ?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి