YSRCP Plenary Schedule: రేపే వైసీపీ ప్లీనరీ, అధికారంలోకొచ్చాక తొలిసారి - మొదటిరోజు కంప్లీట్ షెడ్యూల్ ఇదీ
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ సమావేశం ఇది. దీంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఎజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్లీనరీ ప్రారంభం కానుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వైసీపీ ప్లీనరీలో కీలక అంశాలపై నేతలు చర్చించనున్నారు. మొదటి రోజు ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకూ సభ్యుల రిజిస్ట్రేషన్ ఉంటుంది. 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండాను అద్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆవిష్కరిస్తారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన జరుగుతుంది. 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డికి నివాళి తరువాత సర్వమత ప్రార్థనలు జరుగుతాయి. 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటన విడుదల చేస్తారు. ఈ ప్రకియను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పర్యవేక్షిస్తారు.
సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం ఉంటుంది. జగన్ స్పీచ్ తరువాత పార్టీ జమా ఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం ఉంటుంది. అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం జరుగుతుంది. 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాల నివేదన ఉంటుంది. ఆ తర్వాత తీర్మానాలు ప్రారంభం అవుతాయి, 11 గంటల 45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం ఉంటుంది. ఈ తీర్మానం పై మంత్రులు ఉషాశ్రీ చరణ్, రోజా, ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతారు. రెండో అంశంగా విద్యపై తీర్మానం ఉంటుంది. ఒంటి గంటకు విద్యపై తీర్మానం చేస్తారు.
ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడుతారు. రెండు గంటల 15 నిమిషాల నుంచి పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 2:30కు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం ఉంటుంది. డీబీటీపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్లి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడుతారు..మూడు గంటల 15 నిమిషాలకు వైద్యం పై తీర్మానం ఉంటుంది.వైద్య అంశంపై మంత్రులు విడదల రజిని, డాక్టర్ సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనీల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడుతారు. సాయంత్రం నాలుగున్నరకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ జరుగుతుంది. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి మాట్లాడుతారు. సాయంత్రం ఐదు గంటలతో మొదటి రోజు ప్లీనరీ సమావేశం ముగుస్తుంది.
అధికారంలోకి వచ్చిన తరువాత తొలి ప్లీనరీ
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత జరుగుతున్న తొలి ప్లీనరీ సమావేశం ఇది. దీంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సాహంగా ప్లీనరీ సమావేశాలకు తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కార్యకర్తలు సమావేశాలకు తరలి వచ్చేందుకు వీలుగా ఆయా నియోజకవర్గాల వార్లీగా ప్లానింగ్ చేస్తున్నారు. రెండో రోజు ముగింపు సమావేశానికి లక్ష మంది వస్తారని అంచన వేస్తున్నారు. ఐదు సంవత్సరాలకు ఒక సారి జరిగే పార్టీ పండుగ కావటంతో క్యాడర్ తో పాటుగా నాయకులు కూడా ఉత్సాహంగా ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు అవసరం అయిన అన్ని చర్యల పైనా దృష్టి సారించారు.