Budvel YSRCP Target Miss : లక్ష ఓట్ల మెజార్టీ లక్ష్యాన్ని సాధించలేకపోయిన వైఎస్ఆర్‌సీపీ ! ఓటింగ్ తగ్గడమే కారణం !
లక్ష ఓట్ల మెజార్టీ సాధించాలని లక్ష్యంగా పెట్టి .. మంత్రి పెద్దిరెడ్డిని ఇంచార్జ్‌గా పెట్టినా వైఎస్ఆర్‌సీపీ బద్వేలులో 90వేల ఓట్ల దగ్గరే ఆగిపోయింది.
బద్వేలు నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకుని పార్టీ నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసి పంపించారు. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోవడంతో ఈ లక్ష్యాన్ని సులువుగా సాధించేయగలమని అధికార పార్టీ నేతలు కూడా అనుకున్నారు. కానీ వారి ఆశలు.. అంచనాలు 90వేల దగ్గరే ఆగిపోయాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష ఓట్ల మెజార్టీని లక్ష్యంగా పెట్టుకోవడానికి ఓ కారణం ఉంది. అది గతంలో ఇలా జరిగిన ఉపఎన్నికల్లో టీడీపీ లక్షకుపైగా ఓట్ల మెజారిటీని సాధించడమే.
Also Read : బద్వేలులో వైఎస్ఆర్‌సీపీ విజయం.. మెజార్టీ 90,089 !
2015లో తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ చనిపోయారు. తెలుగుదేశం పార్టీ ఆయన భార్య సుగుణమ్మకే టిక్కెట్ ఇచ్చింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదు. కానీ ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి బరిలో నిలిచారు. ఈ కారణంగా ఏకగ్రీవం జరగలేదు. పోటీ జరిగింది. అయినప్పటికీ పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌కు వచ్చి ఓట్లు వేశారు. ఈ కారణంగా టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ లక్షా పదివేలకుపైగా మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టించారు. ఆ మార్క్ దాటాలని సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
Also Read : 2019లో 735 - 2021లో 21621 .. బద్వేలులో బీజేపీ పికప్ !
కానీ బద్వేలులో ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయారు. దీనికి కారణం ఓటింగ్‌ను పెంచుకోలేకపోవడమే. అసెంబ్లీ ఎన్నికల్లో సాధారణంగా 80 శాతం వరకూ పోలింగ్ నమోదవుతుంది. కానీ ఉపఎన్నికల్లో 68.12 శాతం ఓటింగ్ మాత్రమే నమోదయింది. గత ఎన్నికల్లో 76.37 శాతం నమోదయింది. అంటే గత ఎన్నికల్లో కన్నా 8.25 శాతం తక్కువగా నమోదైంది.
Also Read : "సమైక్య రాష్ట్రంగా మళ్లీ ఏపీ" ! సాధ్యమా ? రాజకీయమా?
పోటీ తీవ్రంగా లేకపోవడం, టీడీపీ, జనసేన పోటీలో లేకపోవడంతో ఆ పార్టీలకు చెందిన సానుభూతి పరులు ఓటు వేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపించలేదు. వలస ఓటర్లను రప్పించడంలో పార్టీలు పెద్దగా దృష్టి పెట్టలేదు. ఈ కారణాల వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము లక్ష్యంగా పెట్టుకున్న లక్ష ఓట్ల మెజార్టీని సాధించలేకపోయారు.