Swarupananda: తపస్సు కోసం వెళ్తున్న స్వరూపానంద - సెక్యూరిటీ అక్కర్లేదని ఏపీ డీజీపీకి లేఖ - ఇక ఏపీకి రానట్లే !?
Andhra Pradesh: తనకు ఎక్స్ కేటగిరి సెక్యూరిటీ అవసరం లేదని స్వరూపానంద ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తపస్సు చేసుకునేందుకు రిషికేష్ వెళ్తున్నానని ఆయన చెబుతున్నారు.
Swaroopananda wrote to AP DGP that he does not need X category security: విశాఖ శారదాపీఠానికి చెందిన స్వరూపానంద ఏపీ డీజీపీకి లేఖ రాశారు. తనకు ఇస్తున్న ఎక్స్ కేటగిరి సెక్యూరిటీ అవసరం లేదని ఉపసంహరించుకోవాలని కోరారు. ఎక్స్ కేటగిరి సెక్యూరిటీ కింద ఆయనకు వన్ ప్లస్ వన్ భద్రత కేటాయిస్తున్నారు. అయితే ఇప్పుడు తన ఆ సెక్యూరిటీ కూడా అవసరం లేదని చెబుతున్నారు. తపస్సు చేసుకునేందుకు స్వరూపానంద రిషికేష్‌కు వెళ్తున్నారని ఎక్కువ కాలం అక్కడే ఉంటారని అందుకే భద్రత వద్దని శారదాపీఠం నిర్వాహకులు చెబుతున్నారు.
ఇక ఏపీలో ఉండనట్లే !
ఎన్నికలు జరగక ముందు చినముషిడివాడలోని శారదాపీఠంలో జరిగిన జన్మదిన వేడుకల్లో స్వరూపానంద ఇక నుంచి తాను ఏపీలో పుట్టిన రోజులు జరుపుకోనని ప్రకటించారు. హైదరాబాద్‌లోని కోకాపేటలో ఆధ్యాత్మిక కేంద్రం నిర్మిస్తున్నామని ఇక అక్కడే ఎక్కువ కాలం గడుపుతానని చెప్పారు. అయితే ఇప్పుడు ఆయన అక్కడ కూడా ఉండటం లేదు. రిషికేష్‌లో ఉండాలనుకుంటున్నారు. అంటే ఇక నుంచి ఆయన ఏపీలో ఉండరని భావిస్తున్నారు.
జగన్, కేసీఆర్ ప్రభుత్వాల నుంచి పలు మేళ్లు పొందిన స్వరూపానం
స్వరూపానంద విశాఖలోని చిన ముషిడివాడలో సొంతంగా పీఠం పెట్టుకుని స్వామిజీగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ స్వాముల్లో ఆయన ముందు ఉంటారు. కేసీఆర్, జగన్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలుగా ఉన్నప్పుడు ఆయన హవా నడిచింది. ఇద్దరు సీఎంలు ఏర్పాటు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని వారిద్దరూ మరో ఇరవై, ముఫ్పై ఏళ్లు సీఎంగా ఉంటారని చెప్పేవారు. దానికి తగ్గట్లుగానే ప్రభుత్వాల నుంచి ఆయనకు చాలా మేళ్లు జరిగాయి. శారదాపీఠానికి కేసీఆర్ ప్రభుత్వం రెండు ఎకరాలు ఉచితంగా కేటాయించింది. అలాగే ఏపీలో రూ. 300 కోట్ల విలువైన స్థలం కేటాయించారు. తిరుమలలో కూడా పీఠం తరపున భవనం నిర్మించారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్థలాన్ని రద్దు చేశారు. తిరుమల భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించారు.
Also Read: అఖిల్ చేసుకోబోయే అమ్మాయి జగన్ సలహాదారు కుమార్తె - జైనాబ్ రావడ్జీ గురించి కొన్ని విషయాలు ఇవే
సమస్యలు వస్తాయని వెళ్లిపోతున్నారా ?
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్పప్పుడు దేవాదాయ శాఖ స్వరూపానంద గుప్పిట్లో ఉండేదని చెబుతారు. కొంత మంది టీటీడీ బోర్డు సభ్యులను కూడా ఆయన సిఫారసుతోనే నియమించేవారన్న ఆరోపణలు ఉన్నాయి. తాజాా ప్రభుత్వాలు మారిపోవడంతో ఏపీ, తెలంగాణలో ఉండటం కన్నా రిషికేష్‌లో ఉండటం మంచిదని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చినముషిడివాడలోని శారదా పీఠాన్ని కూడా గెడ్డను ఆక్రమించి నిర్మించినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నివేదిక ప్రస్తుతం విశాఖ మున్సిపల్ అధికారుల వద్ద ఉన్నట్లుగా తెలుస్తోంది.