Andhrapradesh: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్.. జీతాల్లో కోత
ఏపీలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు షాక్ తగలనుంది. రెండేళ్ల సర్వీసు పూర్తై ప్రొబేషన్ కోసం వెయిట్ చేస్తున్న వారికి ఓ చేదు వార్త వచ్చింది.
రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని ప్రొబేషన్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న గ్రామ, సచివాలయ ఉద్యోగుల జీతాల్లో కోతలు పడ్డాయి. మరో విషయం ఏంటంటే.. బయోమెట్రిక్ హాజరు లేదని అక్టోబరు జీతంలో కొందరికి 10%, మరికొందరికి 50% వరకు తగ్గించినట్టు తెలుస్తోంది. సెప్టెంబరు 23 నుంచి అక్టోబరు 22 వరకు హాజరుకు సంబంధించిన డాటా ఆయా జిల్లా కేంద్రాలకు వచ్చింది. దీని ద్వారానే ఉద్యోగులకు జీతాలు వేయాలని ఆదేశాలు వెళ్లాయి. సాంకేతిక సమస్యలను పరిష్కరించకుండా హాజరు లేదని జీతాల్లో కోత విధించడంపై ఉద్యోగుల్లో ఆందోళనలో ఉన్నారు. కొంతమంది ఉద్యోగులు.. అధికారులకు వినతిపత్రాలు కూడా ఇచ్చారు. సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
సిగ్నల్ సమస్యతో కొన్ని చోట్ల బయోమెట్రిక్ ఆన్‌లైన్ విధానం సరిగా పనిచేయ లేదని ఉద్యోగులు చెబుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో డివైజ్‌లు అందుబాటులో లేవంటున్నారు. బయోమెట్రిక్ హాజరు యాప్‌తో సంబంధం లేకుండా గతంలో లానే ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని, ప్రొబేషన్ పూర్తి చేసి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలని సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను నియమించింది. 1.34 లక్షల మందిని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా నియమించారు. ఈ ఏడాది అక్టోబరు 2తో మెుదట విధుల్లో చేరిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రెండేళ్ల సర్వీసు కంప్లీట్ అయింది. వారు ప్రొబేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ ఖరారు చేసే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. ఈ టైమ్ లో జీతాల్లో కోత విధించడంపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: Weather Update: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ, రేపు.. ఆ ప్రాంతాల్లో వర్షాలు