Car Hazard Lights: మీ ప్రాణ రక్షణలో కీలకమైన కారు హజార్డ్ లైట్స్ - ఎప్పుడు ఆన్ చేయాలో తెలుసా?
Car Hazard Lights Usage: హజార్డ్ లైట్స్ లేదా ఎమర్జెన్సీ లైట్స్ వాడకం చాలా ముఖ్యం. కానీ చాలా మంది వీటిని తప్పుగా వాడుతున్నారు. కారు డ్రైవర్లు తప్పక తెలుసుకోవాల్సిన సరైన విధానం ఇది.

How to correctly use hazard lights in your car: కారు నడిపేటప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్లు వస్తే మనం మొదటగా చేసే పని హజార్డ్ లైట్స్ ఆన్ చేయడం. కానీ చాలామంది వాటిని ఎప్పుడు ఆన్ చేయాలో, ఎప్పుడు చేయకూడదో తెలియక పొరపాట్లు చేస్తున్నారు. వీటిని సరిగ్గా వాడటం మీ & మీ కుటుంబ సభ్యుల భద్రతకు చాలా అవసరం.
మన దేశంలో, ఏటా లక్షల రోడ్డు ప్రమాదాలు జరుతున్నాయి. ఈ ప్రమాదాల్లో లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు, అంతకంటే ఎక్కువ సంఖ్యలో గాయపడుతున్నారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం వేగం, తప్పుడు డ్రైవింగ్ వంటి కారణాల వల్లే జరుగుతున్నాయి. అందుకే, ట్రాఫిక్ విభాగం రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలంటూ పిలుపునిచ్చింది.
రహదారి భద్రతలో భాగంగా... హజార్డ్ లైట్స్‌ను సరిగ్గా వాడటం చాలా ముఖ్యం. కారు డాష్‌బోర్డ్ మీద ఎర్రటి త్రిభుజం గుర్తుతో ఉన్న బటన్ నొక్కితే అన్ని ఇండికేటర్లు ఒకేసారి మెరుస్తుంటాయి - ఇవే హజార్డ్ లైట్స్.
హజార్డ్ లైట్స్ ఎప్పుడు వాడాలి?
1. కారు బ్రేక్‌డౌన్ లేదా టైర్ పంక్చర్ అయినప్పుడు:
కారు మధ్య రోడ్డులో ఆగిపోతే వెంటనే హజార్డ్ లైట్స్ ఆన్ చేయాలి. ఇలా చేయగానే, మీ కారు నిలిచిపోయిందని వెనుక వస్తున్న వాహన డ్రైవర్లకు అర్ధం అవుతుంది. కారుకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, విరామం కోసం రోడ్డు పక్కన నిలిపినప్పుడు కూడా ఈ లైట్లు సేఫ్టీకి ఉపయోగపడతాయి.
2. ప్రమాదం జరిగిన తర్వాత:
యాక్సిడెంట్ జరిగి కారు రోడ్డులో అడ్డుగా నిలిచినప్పుడు, హజార్డ్ లైట్స్ ఆన్ చేస్తే ఇతర డ్రైవర్లు స్లో అవుతారు. దీంతో మరిన్ని ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు.
3. కారును మరో వాహనంతో లాగుతున్నప్పుడు:
మీ వాహనాన్ని మరో వాహనం ద్వారా లాగుతున్నప్పుడు హజార్డ్ లైట్స్ ఆన్ ఉంచితే, ఇతరులు సులభంగా గుర్తిస్తారు. ఇది మీ & అవతలి వ్యక్తుల సేఫ్టీ కోసం తప్పనిసరి.
హజార్డ్ లైట్స్ ఎప్పుడు వాడకూడదు?
1. పొగ మంచు లేదా వర్షం సమయంలో:
చాలామంది పొగ మంచులో లేదా భారీ వర్షంలో హజార్డ్ లైట్స్ ఆన్ చేస్తారు. ఇది తప్పు. ఎందుకంటే, ఈ లైట్లు చూసిన ఇతరులకు మీరు ఆగిపోయారా లేక వెళ్తున్నారా అనే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇలాంటి సందర్భాల్లో ఫాగ్ ల్యాంప్స్ లేదా లో-బీమ్ హెడ్‌ల్యాంప్స్ వాడాలి.
2. టన్నెల్‌లో డ్రైవ్ చేస్తున్నప్పుడు:
టన్నెల్‌లో వెళ్లేటప్పుడు ఎమర్జెన్సీ సిట్యుయేషన్ కాదు కాబట్టి హజార్డ్ లైట్స్ ఆన్ చేయకూడదు. మీరు హజార్డ్ లైట్స్ ఆన్ చేస్తే, మీ వెనుక ఉన్న డ్రైవర్లు మీ కారు ఆగిపోయిందని భావించే ప్రమాదం ఉంది. అందుకే కేవలం హెడ్‌ల్యాంప్స్ మాత్రమే ఆన్ ఉంచండి.
హజార్డ్ లైట్స్ సరిగ్గా వాడటం చాలా చిన్న విషయం అనిపించినా, ఇది చాలా ప్రమాదాలను నివారించగలదు. కాబట్టి కారు నడిపేటప్పుడు ఈ సేఫ్టీ రూల్స్ పాటిస్తే మీ భద్రతే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా కాపాడినట్టే అవుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















