RTC Bus Incidents: విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న బస్సులో పొగలు.. హైదరాబాద్ ఓఆర్ఆర్ లో కారులో మంటలు
కర్నూలులో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి 19 మంది చనిపోయిన మరుసటిరోజే తెలుగు రాష్ట్రాల్లో పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చాయి. అసలే బస్సు ప్రమాదాలు, కార్లలో మంటలు చెలరేగుతున్న సమయం కావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. బస్సులో పొగలు రావడంతో డ్రైవర్ వెంటనే బస్సును నందిగామ వద్ద రోడ్డు పక్కన ఆపేశారు. బస్సులోంచి ప్రయాణికులను కిందికు దించేశారు.
బస్సులో పొగలు రావడంతో అందులో ప్రయాణిస్తున్న 15 మంది ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. అయితే వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ ప్రమాదం జరగకుండా ఉండాలని బస్సును నందిగామ వద్ద నిలిపివేశారు. ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను మరో బస్సులో పంపించింది. పొగలు రావడానికి కారణం ఏంటని చెక్ చేశారు. ఇంజిన్లో ఫ్యూయల్ లీక్ కావడం వల్ల పొగలు వచ్చాయని డ్రైవర్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొని 8 మందికి గాయాలు
దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లిలో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. దాచేపల్లి మండలం శ్రీనగర్ వద్ద ఓ లారీ, తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్సు దాచేపల్లికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో బస్సులో 45 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
హైదరాబాద్ ఓఆర్ఆర్ వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా
హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. పెద్ద అంబర్‌పేట్ ఓఆర్‌ఆర్ వద్ద ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు పెద్దఅంబర్‌పేట్ ORR జంక్షన్‌లో అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొని రోడ్డు పక్కకు ఒరిగ పడిపోయింది. ఆ సమయంలో ట్రావెల్స్ బస్సులో 15 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ఆరుగురికి గాయాలు కాగా, వారిని చికిత్స అందించేందుకు డీఆర్డీవో అపోలో, హయత్ నగర్ ఆస్పత్రులకు తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ ఓఆర్ఆర్ పై కారులో మంటలు
రాజేంద్రనగర్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న ఓ కారులో శనివారం మంటలు చెలరేగాయి. కొంత సమయానికే కారు మంటల్లో కాలి బూడిదైంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోనీ ORR పై ఐ20 కారులో అకస్మాత్తుగా చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించి కారులో నుండి కిందికి దిగిన ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. సమాచారం అందుకుని నార్సింగి పోలీసులు, ఓఆర్ఆర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకపోయింది. అప్పటికే కారు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు వచ్చి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






















