ఏపీలో ఇసుక, మద్యం విక్రయాలు కేంద్రానికి కనిపించట్లేదా? వాటాలు అందుతున్నాయా - కేవీపీ
మాజీ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు, మద్యం విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అన్నారు.
Kvp Ramachandra Rao Fires On Bjp : మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ (Congress)సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు (Kvp Ramachandra Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విచ్చలవిడిగా ఇసుక (sand)అక్రమాలు, మద్యం (Wine) విక్రయాలు జరుగుతుంటే...కేంద్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీయేతర రాష్ట్రాలన్నింటిలో మంత్రులను అరెస్టు చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్...ఆంధ్రప్రదేశ్ లో మంత్రులను ఎందుకు వదిలేసిందని నిలదీశారు. ఏపీలో జరుగుతున్న అక్రమాల్లో కాషాయ పార్టీకి వాటాలు అందుతున్నాయా అని కేవీపీ రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సహకారం లేకుండా...ఏపీ ప్రభుత్వం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయగలదా అని ప్రశ్నించారు.
ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే...
ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగనే అన్నారు కేవీపీ రామచంద్రరావు. ఇసుక, మద్యం కుంభకోణాల్లో దేశంలో చాలా మంది నేతలను అరెస్టు చేశారని. ఏపీలోని నేతలను అరెస్టు చేయకపోవడంలో ఆంతర్యం ఏంటన్నారు. బీజేపీ దృష్టిలో దేశంలో ఎలాంటి మరక లేని ప్రభుత్వం ఏపీ ఒక్కటే అనుకుంటా ? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీలోని ఏ మంత్రి పైనా, ఎంపీలపైనా కేసులు, అరెస్టులు ఎందుకు పెట్టలేదో బీజేపీ చెప్పాలని కేవీపీ రామచంద్రరావు డిమాండ్ చేశారు దేశం అంతా నగదు రహిత లావాదేవీలు ఉన్నా...ఏపీలో మాత్రం అంతా నగదుతోనే విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలిసినా..చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే.. సీఎం జగనే ఎక్కువ సార్లు ఢిల్లీ వెళ్లి బీజేపీ నేతలను కలిశారని విమర్శించారు.
వైసీపీ పోలవరాన్ని ఏటీఎంలా వాడుకుంది
ఇవాళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దర్శనం దొరికినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అభినందించాలంటూ కేవీపీ రామచంద్రరావు సెటైర్లు వేశారు. వైఎస్ బొమ్మ పెట్టుకుని ఓట్లు అడగడానికి వెళ్తున్న వైసిపి నేతలకు సిగ్గు లేదన్నారు. పోలవరం పూర్తి అయితే చాలా ఎత్తిపోతల పథకాలు నిర్మించుకునే అవకాశం ఉంటుందని, పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో అర్ఠం కావడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని భావితరాలు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని, గత టీడీపీ ప్రభుత్వాన్ని క్షమించవన్నారు. పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేసిన వైసీపీ ప్రభుత్వం...ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటోందన్నారు. పోలవరం బ్యారేజీలా మిగిలిపోకూడదన్న ఆయన, ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి జగన్... కేంద్రం నుంచి ఏం సాధించుకొని వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తల్లి, చెల్లిని సంరక్షించలేని అసమర్థులు
సొంత తల్లి, చెల్లిని కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు కేవీపీ రామచంద్రరావు. తల్లి, చెల్లిని సంరక్షించలేని వారి కంటే అసమర్థులు ఇంకెవరూ ఉండరని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ల పంపకం, స్వీట్లు పంచుకోవడం, వాటాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి....ఈ రెండు పార్టీలు పట్టించుకోవన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్న ఆయన. నిరుద్యోగం పోవాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు కేవీపీ రామచంద్రరావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ వెళ్లలేదని..స్వప్రయోజనాల కోసమే వెళ్లారని విమర్శించారు.