AP BJP Chief Madhav Shocking Comments: పవన్ కల్యాణ్‌పై తమిళనాడు ప్రభుత్వం కేసు: బీజేపీ ఫైర్! అసలు కారణం ఇదేనా?
AP BJP Chief Madhav: ఏపీ డీసీఎం పవన్‌పై కేసు పెట్టిన తమిళనాడు ప్రభుత్వంపై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఆ మురుగన్‌పై దాడిగా అభివర్ణించారు.

AP BJP Chief Madhav: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై నమోదు అయిన కేసుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడు ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతే మాధవ్ చేసిన తొలి పవర్‌ఫుల్ స్టేట్మెంట్ హాట్‌టాపిక్‌గా మారింది.
తమిళనాడులో పాలన దుర్మార్గంగా ఉందని విమర్శించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. మురుగన్ సభలో పాల్గొన్న పవన్‌పై కేసు పెట్టడాన్ని తప్పుపట్టారు. పవన్‌పై కేసు పెట్టడమంటే మురుగన్‌పై దాడిగా ఆయన అభివర్ణించారు. అన్నామలైకి అండా ఉంటున్నందుకే పవన్‌ను టార్గెట్ చేశారని అన్నారు.
తమిళనాడులో డీఎంకే గ్రాఫ్ పడిపోతుందని అన్నారు మాధవ్. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఓటమి ఖాయమని అభిప్రాయపడ్డారు. అందుకే అక్కడి సమస్యలను డైవర్ట్ చేయడానికి బీజేపీ ఎదగకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. తాము మాత్రం తమిళనాడు బీజేపీ నేతలకు, పవన్ కల్యాణ్‌కు అండగా ఉంటామని ప్రకటించారు.
పవన్ కల్యాణ్‌పై ఎందుకు కేసు ?
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై 22 జూన్ 2025న మదురైలో జరిగిన మురుగన్ భక్తుల సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన పవన్ అక్కడికి వచ్చి భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సెక్యులరిజం పేరుతో హిందూ దేవతలను అవమానిస్తున్నారని పవన్ మండిపడ్డారు. హిందూ ధర్మాన్ని అవమానించవద్దని విజ్ఞప్తి చేశారు. పసుంపోన్ ముత్తురామలింగ తేవర్‌ను "మురుగన్ అవతారం"గా అభివర్ణించారు.
ఈ వ్యాఖ్యలపై తమిళనాడు ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. డీఎంకే సానుభూతిపరులను రెచ్చకొట్టేలా ఉన్నాయని కేసులు పెట్టింది. గతంలో కూడా సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నారని తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై పవన్ విమర్శలు. ఇప్పుడు కూడా ఆయన్నే టార్గెట్ చేశారని డీఎంకే నేతలు అభిప్రాయపడుతున్నారు. అందుకే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.
ఏఏ సెక్షన్‌ల కింద కేసులు పెట్టారు
1 జులై 2025న క్రైమ్ నంబర్ 497/2025 కింద పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మత, జాతి ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మత భావనలు కించపర్చడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే ఉద్దేశపూర్వక చర్యలు), 353(1)(b)(2) (సామాజిక శాంతిని భంగపరిచే ప్రకటనలు) కింద కేసు కట్టారు.
ఇందులో ఎవరెవరు నిందితులు
మురుగన్ భక్తుల సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించిన ఏపీ డీసీఎం పవన్ కల్యాణ్‌తోపాటు కె. అన్నామలై, హిందూ మున్నాని అధ్యక్షుడు కడేశ్వర సుబ్రమణియం, రాష్ట్ర కార్యదర్శి ఎస్. ముత్తుకుమార్, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూ మున్నాని, సంఘ్ పరివార్ సంస్థ నేతలు, కార్యక్రమ నిర్వహాకులపై కేసులు పెట్టారు. వారందర్నీ నిందితులుగా చేర్చారు.
కోర్టు ఏం చెప్పింది?
మురుగన్ భక్తుల సమ్మేళన కార్యక్రమానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. కానీ కార్యక్రమ నిర్వాహకులు మాత్రం పట్టువీడలేదు. హైకోర్టులో పిటిషన్ వేశారు. వాళ్ల పిటిషన్ విచారించిన మద్రాస్ హైకోర్టు షరతులు పెట్టి సమ్మేళనాన్ని నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది. రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఈ రూల్‌నే నిర్వాహకులు, హాజరైన వారంతా ఉల్లంఘించారని కేసు పెట్టారు.
విద్వేషపూరిత ప్రసంగాలు లేకపోయినా కావాలనే కక్షపూరితంగా కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కార్యక్రమం విజయవంతమైందని ప్రజల్లో మార్పును గమనించిన ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విమర్శిస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు కూడా తమిళనాడు ప్రభుత్వం చర్యలను తప్పుపడుతున్నారు.





















