Case On Pawan Kalyan: పవన్ కల్యాణ్‌ను టచ్ చేసిన తమిళనాడు - రెచ్చగొట్టారని క్రిమినల్ కేసు నమోదు
Pawan Kalyan: పవన్ కల్యాణ్ తమిళనాడులో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని కేసు నమోదు అయింది. గతంలో పవన్ డిప్యూటీ సీఎం ఉదయనిధిపై విమర్శలు చేసి ఉండటంతో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకంది.

Criminal registered against Pawan Kalyan in Tamil Nadu: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదైంది. మదురైలో జూన్ 22, 2025న జరిగిన మురుగన్ భక్తుల సమ్మేళనం లో చేసిన ప్రసంగంపై ఫిర్యాదు ఆధారంగా నమోదు చేశారు. మదురైలో హిందూ మున్నాని సంస్థ నిర్వహించిన మురుగన్ భక్తుల సమ్మేళనంలో పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై, హిందూ మున్నాని నాయకులు కడేశ్వర సుబ్రమణియం, ఎస్. ముత్తుకుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. "సెక్యులరిజం పేరుతో కొందరు హిందూ దేవతలను అవమానిస్తున్నారు" అని విమర్శించారు. హిందూ ధర్మాన్ని అవమానించవద్దని కోరారు. పసుంపోన్ ముత్తురామలింగ తేవర్‌ను "మురుగన్ అవతారం"గా పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను తమిళనాడులో రాజకీయ పార్టీలు ముఖ్యంగా డీఎంకే సానుభూతిపరులు ప్రజల్ని రెచ్చగొట్టేవిగా ఉన్నాయని అనుకున్నారు. గతంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మాన్ని విమర్శించిన డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కూడా ఉదయనిధిని టార్గెట్ చేశారని అనుకున్న డీఎంకే నేతలు..చట్టపరమైన చర్యల కోసం ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. ఉదయనిధి 2023లో సనాతన ధర్మాన్ని "డెంగ్యూ, మలేరియా లాంటిదని, దాన్ని నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి.
మదురైకి చెందిన న్యాయవాది, మదురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సమన్వయకర్త ఎస్. వంచినాథన్ మురుగన్ భక్తుల సమ్మేళనంలో చేసిన ప్రసంగాలు మద్రాస్ హైకోర్టు నిర్దేశించిన రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలపై నిషేధాన్ని ఉల్లంఘించాయని, మత విద్వేషాలను రెచ్చగొట్టాయని ఆరోపిస్తూ జూన్ 30, 2025న మదురైలోని అన్నానగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జూలై 1, 2025న క్రైమ్ నంబర్ 497/2025 కింద కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 196(1)(a) (మత, జాతి ఆధారంగా విద్వేషం రెచ్చగొట్టడం), 299 (మత భావనలను కించపర్చడం), 302 (సామాజిక సామరస్యాన్ని భంగపరిచే ఉద్దేశపూర్వక చర్యలు), 353(1)(b)(2) (సామాజిక శాంతిని భంగపరిచే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశారు.
పవన్ కల్యాణ్ తో పాటు కె. అన్నామలై, హిందూ మున్నాని అధ్యక్షుడు కడేశ్వర సుబ్రమణియం, రాష్ట్ర కార్యదర్శి ఎస్. ముత్తుకుమార్, ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూ మున్నాని, సంఘ్ పరివార్ సంస్థలకు చెందిన కార్యక్రమ నిర్వాహకులపై కేసులు పెట్టారు. ఇతర సముదాయాల మత భావనలను కించపరిచాయని, ఆధ్యాత్మిక సమావేశం పేరుతో సామాజిక అశాంతిని సృష్టించే ఉద్దేశంతో జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అనుమతి ఇవ్వకపోవడంతో నిర్వాహకులు కోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు ఈ సమ్మేళనాన్ని నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది, కానీ రాజకీయ, మతపరమైన వ్యాఖ్యలపై కఠిన ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసును డీఎంకే ప్రభుత్వం రాజకీయ కక్ష్య సాధింపుగా పెట్టినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.





















