Pawan Kalyan: పదహారో ఏటే శబరిమల వెళ్లా, విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాణ్ణి- మురుగన్ ధర్మం ఆగదు: పవన్ కళ్యాణ్
#PawanKalyanInLandOfMurugan | క్రిస్టియన్లు, ముస్లింలు వారి మతాన్ని గౌరవించవచ్చు, కానీ హిందువులు వారి మతాన్ని గౌరవిస్తే మాత్రం ఎందుకు అభ్యంతరం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

#MurugaBakthargalManadu | మధురై: ఒక క్రైస్తవుడు తన మతాన్ని గౌరవించవచ్చు. ఒక ముస్లిం వారి మతాన్ని గౌరవించవచ్చు. కానీ హిందువు తన మతాన్ని గౌరవిస్తే మాత్రం అభ్యంతరం? ఎందుకు? హిందు ధర్మాన్ని, హిందూ దేవతలను చులకన చేస్తారు. వారిది సెక్యులరిజం కాదు... సూడో సెక్యులరిజం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. నేను పదహారు ఏటే శబరిమల వెళ్లినవాణ్ణి. థైపూసం సందర్భంగా తిరుత్తణికి భక్తుల పోటును చూశాను. విభూతి పెట్టుకొని స్కూల్‌కి వెళ్లినవాడిని అని గుర్తుచేసుకున్నారు. తమిళనాడులోని మధురైలో నిర్వహించిన మురుగ భక్తర్గళ్ మానాడులో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘ధర్మం అంటే ఏంటి? దుష్ట శక్తులను తొలగించడం ధర్మం. ప్రతివారినీ సమానంగా చూడటం ధర్మం. దుష్టులను శిక్షించడం ధర్మం. ఒక పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులో ఎందుకు చేస్తున్నావు? గుజరాత్ లేదా యూపీలో ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నాడు. వారిది విభజన ఆలోచన. ఇలాంటి వారు శివునిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారు. వారిది చాలా ప్రమాదకరమైన ఆలోచన.

నేను 2014 లో హైదరాబాద్ లో పార్టీ స్థాపించాను. తమిళనాడులో పెరిగిన వాడ్ని. తమిళనాడు లో సంస్కృతిని అర్ధం చేసుకున్నవాడిని, తమిళనాడు సంస్కృతిపై గౌరవాన్ని పెంచుకున్నాను. ఏథెన్స్ కంటే ప్రాచీనమైన మధురై నగరంలో ఇన్ని లక్షల ప్రజల మధ్య, హిందూ సాధువుల మధ్య మాట్లాడుతానని ఎప్పుడూ ఊహించలేదు. మురుగన్‌ను నమ్మితే విజయం తధ్యం. మురుగన్‌ను నమ్మితే ఎదుగుదల సుసాధ్యం. మురుగన్‌ను నమ్మితే శక్తి వస్తుంది. స్కంధ షష్టి కవచం మన మనస్సును ఉక్కుగా మారుస్తుంది. మన జీవితాన్ని గొప్పగా మార్చుతుంది.
ఎలుకల సంఖ్య ఎంత ఉన్నా, ఒక నాగుపాము గట్టిగా శబ్దం చేస్తే సరి వాటంతట అవే పరుగు తీస్తాయి. అలాగ మన శత్రువులు ఎంత మంది ఉన్నా, మురుగన్ తండ్రి శివుడి మెడలోని నాగుని చూసే పారిపోతారు. కాబట్టి, మార్పు కచ్చితంగా వస్తుంది. "అచమిల్లై అచమిల్లై అచమ్ ఎన్బతు ఇల్లయే" అనే మహాకవి భారతీయర్ మాటలు ధైర్యాన్ని ఇస్తాయి. మార్పు కావాలంటే ధైర్యం ఉండాలి. కష్టాన్ని ఆపేస్తే, కాలం నడక ఆపదు. అలానే, కొందరి కుత్సిత ఆలోచనలతో మురుగన్ ధర్మం ఆగదు. ఆ ధర్మం నడుస్తూనే ఉంటుంది.
#PawanKalyanInLandOfMurugan
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2025
Hon’ble Deputy Chief Minister Sri @PawanKalyan Garu makes a Majestic entry at the "Muruga Bhaktargal Maanaadu" in Madurai.#MurugaBakthargalManadu pic.twitter.com/d9bK4IAGAB
ప్రపంచపు తొలి విప్లవ నాయకుడు మురుగన్. మురుగన్‌కు బేధభావం లేదు. అందరూ సమానమే. మధురైలో పార్వతి దేవి స్వరూపం మీనాక్షీ అమ్మవారు... శివుడు సుందరేశ్వరిని రూపంలో కొలువయ్యారు. వారి కుమారుడు కార్తికేయుడు ఇక్కడే కొలువై ఉన్నారు. షష్ట షణ్ముఖ క్షేత్రాల్లో తొలిది, ఆరవది ఈ ప్రాంతంలోనే ఉంది. ఈ తరం వారు మధురై గురించి తెలుసుకోవాలి. మధురై అనేది మీనాక్షి అమ్మవారి పట్టణం, మీనాక్షి అమ్మవారు అంటే పార్వతి అమ్మవారి స్వరూపం. మనం మీనాక్షి అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం. అక్కడ ఆశీర్వాదం పొందుతున్నాం. కుంకుమ తీసుకుంటున్నాం. ప్రసాదం తీసుకుంటున్నాం.

కానీ… ఈ తరం తెలుసుకోలేని నిజం ఒకటి ఉంది. ఒక సమయంలో మధురై ధ్వంసమైంది. ప్రకాశించాల్సిన ఆలయంలో వెలుతురు లేదు. కుంకుమ ఇవ్వాల్సిన ఆలయంలో ఇచ్చేవారూ లేరు. పూజలు జరగలేదు. ఆలయాన్ని మూసివేశారు. ఎందుకు తెలుసా? 14వ శతాబ్ద ప్రారంభంలో మధురైను మాలిక్ కాఫూర్ దోచుకున్నాడు. ఆ తర్వాత 60 సంవత్సరాల పాటు మీనాక్షి ఆలయం మూసివేయబడింది. అలాంటి మధురై చీకటి కాలంలో 14వ శతాబ్దం చివరలో మళ్లీ వెలుతురు పుట్టింది. ఆ వెలుతురును వెలిగించినవాడు విజయనగర యువరాజు కుమార కంబణన్. మనం అర్థం చేసుకోవాల్సింది. మన విశ్వాసాన్ని ఎవరూ నిలువరించలేరు. మన సంప్రదాయం బలమైనది. ధర్మం లోతుగా ఉండబోతుందని’ పవన్ కళ్యాణ్ అన్నారు.






















