Ambati Rambabu: వైఎస్ జగన్ పర్యటనలో ఉల్లంఘనలు.. అంబటి రాంబాబుపై కేసులు నమోదు
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించడంతో వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసులు నమోదు చేశారు.

Former AP Minister Ambati Rambabu | గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో అంబటి రాంబాబు నిషేదాజ్ఞలు ఉల్లంఘించారని కేసులు నమోదయ్యాయి. అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా కొర్రపాడు వద్ద మాజీ మంత్రి అంబటి తన సోదరుడు మురళితో కలిసి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. పలుచోట్ల పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లు తోసేయడంతో పాటు పోలీసులతో వీరు వాగ్వాదానికి దిగారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, వారి విధులకు ఆటంకం కలిగించడం, అంతటతో ఆగకుండా పోలీసులు సైతం అంబటి నెట్టివేశారు. దాంతో విధులకు ఆటంకం కలిగించడం, పోలీసులపై దాడి చేసిన ఘటనలో ఐపీసీ 188, 332, 353, 427 సెక్షన్ల కింద పోలీసులు అంబటి రాంబాబు సహా పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీసుస్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
వివాదాస్పదంగా మారిన జగన్ పర్యటన
పల్నాడు జిల్లా రెంటపాళ్లలో ఇటీవల మాజీ సీఎం జగన్ పర్యటించారు. కేవలం వంద మందికే పర్మిషన్ ఇవ్వగా, వేల మందితో కలిసి వెళ్లారు. బైకులతో ర్యాలీలు చేశారు. జగన్ ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు పెద్ద సంఖ్యలో జనాలు వచ్చారు. ఈ క్రమంలో పలుచోట్ల వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరామర్శకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని అంబటి రాంబాబు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెంటపాళ్లలో వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహా విష్కరణలోనూ తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడటంతో అక్కడ పరిస్థితిని పోలీసులు అదుపుచేయలేకపోయారు.
జగన్ రెంటపాళ్ల పర్యటన సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2029లో వైసీపీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో పొట్టేళ్లను నరికినట్లు టీడీపీ శ్రేణులను రప్పా రప్పా నరికేస్తామని ప్లకార్డులు, పోస్టర్లు ప్రదర్శించారు. దీనిపై జగన్ స్పందించడం మరింత వివాదమైంది. ప్లకార్డుల్లో ఏముందని అడిగి మరీ.. జాతరలో పొట్టేళ్లను నరికినట్లు టీడీపీ వాళ్లను నరుకుతామన్నారు సంతోషమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇది పుష్ప 2 సినిమా డైలాగ్ అని, దీనికి గూడా వివాదం చేస్తారా. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు ఆగ్రహం
జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఫ్లెక్సీలు, వైసీపీ అధినేత కామెంట్లపై ఏపీ సీఎం చంద్రబాబు ఘటుగా స్పందించారు. వైసీపీ అధికారంలోకి వస్తే జనాలను రప్పా రప్పా నరుకుతారా.. ప్రజాస్వామ్యంలో గతంలో ఇలాంటి మాటలు ఎప్పుడైనా విన్నామా అన్నారు. సీఎంగా చేసిన వ్యక్తి, ఇంత దిగజారి రాజకీయాలు చేయడం ఏంటని, నరుకుతే సంతోషం అనడం ఏంటని చండ్రబాబు మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ఉపేక్షించేది లేదని, పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు.






















