Jagan Tour Row: జగన్ కారు కింద పడి వ్యక్తి మృతి! డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Andhra Pradesh News | పల్నాడు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటనలో ఆయన కింద పడి ఓ వ్యక్తి మృతి చెందడం రాజకీయంగా దుమారం రేపుతోంది.

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలోని రెంటపాళ్లలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన వివాదంలో కీలక మలుపు చోటుచేసుకుంది. జగన్ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతిచెందారని ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ కేసులో వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి (ఒంగోలు AR కానిస్టేబుల్) ను గుంటూరు నల్లపాడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదం సమయంలో వాహనం కింద వ్యక్తి పడినట్లు గుర్తించారా? ఈ విషయాన్ని జగన్‌కు చెప్పారా అని విచారించనున్నారు. ప్రమాదం జరిగిన తరువాత వాహనం ఆపకుండా వెళ్లిపోవడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
నల్లపాడు పోలీసులు ఈ కేసులో ఏ1 గా కారు డ్రైవర్ రమణారెడ్డిని, ఏ2 జగన్ పేరు, ఏ3గా ఆ కారు యజమాని పేరు ఎఫ్ఐఆర్‌లో చేర్చాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రమాదానికి గురైన కారు ఫార్చూనర్ AP 40 DS 2349 గా పోలీసులు గుర్తించారు. జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి ఆ కారును వైసీపీ పేరు మీద కొనుగోలు చేశారని తెలుస్తోంది.
కారు ప్రమాదంలో వ్యక్తి చనిపోయిన విషయం తనకు తెలియదని కారు డ్రైవర్ రమణారెడ్డి పోలీసులకు చెప్పినట్లు వినిపిస్తోంది. ఆ ప్రమాదంలో సింగయ్య చనిపోయిన రోజు IPC సెక్షన్ 304ఏ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కెమెరా విజువల్స్‌లో అది జగన్ ప్రయాణిస్తున్న కారు అని గుర్తించడంతో అప్రమత్తమైన పోలీసులు జగన్ కారు నడిపిన డ్రైవర్ రమణారెడ్డిని ఆదివారం నాడు అదుపులోకి తీసుకున్నారు. జగన్ పర్యటనకు సంబంధించి రికార్డు వీడియోల కోసం నల్లపాడు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.






















