Power Cuts In AP: కరెంట్ కోతల పాపం మోదీ, చంద్రబాబుదే- కొనడానికి అవకాశం ఇవ్వడంలేదంటూ కేంద్రంపై ఫైర్
విద్యుత్ కోతలు ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. దీనికి మీరు కారణమంటే మీరు అంటూ అధికార ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కోతలు జనాలను చికాకు పెట్టిస్తుంటే...దీనిపై రాజకీయ విమర్శలు మాత్రం హీట్ పుట్టిస్తున్నాయి. అసలు కోతలు కారణం ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. తాము అధికారంలో ఉన్నట్టు ఒక్క క్షణం కూడా కరెంట్ పోయేది కాదని టీడీపీ ప్రచారం చేస్తుంటే... ఆ విమర్శలను వైసీపీ తిప్పి కొడుతోంది.
విద్యుత్ కోతలపై స్పందించిన పేర్ని నాని... మోదీ, చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దీనంతటికీ కారణం వాళ్లిద్దరే అంటూ మండిపడ్డారు. కచ్చితంగా వాళ్ల చేసిన తప్పులు కారణంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సమస్య ఎదుర్కొంటుందన్నారు.
2014 నుంచి 19 వరకు విద్యుత్ కోతలు లేవని విమర్శలు చేస్తున్న వాళ్లంతా వాస్తవాలు గ్రహించాలన్నారు పేర్ని నాని. లాంతర్లు పట్టుకొని తిరిగేవారంతా అప్పుడు చేసిన తప్పులు గుర్తు చేసుకోవాలన్నారు. నాటి పాలకు చేసిన పాపాలు కారణంగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమస్య ఎదుర్కొంటోందన్నారు నాని. 22 వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్లిపోయిన పరెద్ద మనుషులు ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
నాడు ప్రైవేటు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను చంద్రబాబు ఇవ్వకుండా తర్వాత వచ్చిన తమపై వేశారని చెప్పుకొచ్చారు పేర్ని నాని. ఇష్టారీతిన విద్యుత్ కొనుగోలు చేశారని ఆరోపించారు. మార్కెట్ ధర కంటే ఎక్కువకు కరెంట్ కొనుగోలు చేసి రాష్ట్ర ఖజానాకు గండిపెట్టడమే కాకుండా విద్యుత్ కష్టాలు కొనితెచ్చారన్నారు. 16, 19 రూపాయలకు విద్యుత్ కొని రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారన్నారు నాని. ఇప్పుడు ఆ అప్పులను తాము తీర్చాల్సి వస్తోందన్నారు.
చంద్రబాబు చేసిన అప్పులకు తోడు మోదీ తీసుకొచ్చిన చట్టంతో మరిన్ని సమస్యలు వచ్చి పడ్డాయంటున్నారు పేర్ని నాని. పాత అప్పు ఉంటే కొత్త అప్పు చేయడానికి వీల్లేదని మోదీ చట్టం తెచ్చారని గుర్తు చేశారు. దానికి తోడు బకాయిలు ఉంటే విద్యుత్ కొనడానికి వీల్లేదని చట్టంలో పేర్కొన్నట్టు తెలిపారాయన. 22 వేల కోట్ల రూపాయలు మూడేళ్లలో ఎలా తీర్చగలమో చెప్పాలని ప్రశ్నించారు పేర్ని నాని.
ఇన్ని సమస్యలు ఉన్నాయని చెబుతున్నా వినకుండా... విద్యుత్ కొనడానికి వీల్లేదని.. అమ్మేవాళ్లకు కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు పేర్ని నాని. అప్పుడు చంద్రబాబుకు అప్పులు తెచ్చుకోమని చెప్పిన మోదీ... ఇప్పుడు మాకు మాత్రం వద్దంటున్నారన్నారు. ఆ చట్టం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ సమస్య వచ్చిందన్నారు పేర్ని నాని.
ఇప్పుడు విద్యుత్ కొందామన్నా కేంద్రం చట్టం కారణంగా ఎవరూ ముందుకు రావడం లేదన్నారు పేర్ని నాని. ఇటువంటి పరిస్థితి ఉన్న రాష్ట్రంలో ఏం చేయాలో చెప్పాలని ప్రశ్నించారు పేర్ని నాని. అప్పటి ప్రభుత్వం పెట్టిన బకాయిలు.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్నారు. అప్పటికైనా చాలా తిప్పలు పడుతున్నామని.. సమస్య రాకుండా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.