YSRCP Plenary: వైసీపీకి రాజీనామా, ప్లీనరీలో విజయమ్మ సంచలన ప్రకటన
వైసీపీ ప్లీనరీ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు విజయలక్ష్మి.
వైసీపీ ప్లీనరీ సమావేశంలో సంచలన ప్రకటన చేశారు విజయలక్ష్మి. వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. పార్టీ సభ్యత్వానికీ రాజీనామా చేస్తున్నట్టు స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటం చేస్తోందని, ఆమెకు తాను అండగా నిలవాల్సి అవసరముందని వ్యాఖ్యానించారు. షర్మిలతో కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని, విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ నిర్ణయమని అన్నారు. తన జీవితంలో ప్రతి మలుపు ప్రజాజీవితాలతో ముడి పడి ఉందని వైఎస్ఆర్ చెబుతుండేవారని గుర్తు చేశారు. రాజశేఖర్ రెడ్డి తన వాడే కాదని...అందరివాడని వ్యాఖ్యానించారు. అండగా నిలుస్తున్న ప్రజల్ని అభినందించడానికి, ఆశీర్వదించటానికే వచ్చానని స్పష్టం చేశారు. అధికారం కోసమే రాజకీయ పార్టీలు పుడతాయన్న ఆమె, ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకే వైఎస్‌ఆర్ సీపీ పుట్టిందని స్పష్టం చేశారు.
కోట్లాది మంది అభిమానం నుంచే వైఎస్‌ఆర్‌సీపీ పుట్టిందని అన్నారు. ఎన్నో కష్టాలను, నిందలను, అవమానాలు తట్టుకుని తమ కుటుంబం నిలబడిందని చెప్పారు. అధికార శక్తులన్నీ విరుచుకుపడినా, జగన్ బెదరలేదని వెల్లడించారు. నిజాయతీగా ఆలోచించే వ్యక్తిత్వం జగన్‌కి సొంతమని చెప్పారు. ఏపీలోని వైఎస్‌ఆర్‌సీపీలో ఉంటూనే, తెలంగాణలో షర్మిలకు అండగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయని, రాజకీయం గానూ దీన్ని వాడుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. విమర్శలకు తావు లేకుండా ఇకపై పూర్తి స్థాయిలో షర్మిలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. 2011లో తన బిడ్డ జగన్‌ను ప్రజలకు అప్పగించి, గెలిపించాలని కోరానని ప్రజలు ఆ కోరిక నెరవేర్చారని అన్నారు. ఇప్పుడూ అదే విధంగా తన బిడ్డను ప్రజల చేతుల్లో పెడుతున్నానని చెప్పిన ఆమె, జాగ్రత్తగా కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.