Tirumala News: శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు మరో స్కీమ్ తెచ్చిన టీటీడీ - ఆ పనిచేస్తే సుప్రభాత సేవ నుంచి వేద ఆశీర్వచనం వరకూ
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు కొత్తగా ఓ స్కీమ్ అమల్లోకి తెచ్చింది టీటీడీ. కోటి విరాళం వచ్చే వారికి పలు సేవలు, దర్శన టిక్కెట్లు ఆఫర్ ఇచ్చింది.

Tirumala : తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే ఎంతో కష్టపడాలి. మూడు నెలల ముందే మూడు వందల రూపాయల టిక్కెట్లు బుక్ చేసుకోవాలి. లేకపోతే ఏ రాజకీయ నాయకుడినో పట్టుకుని సిఫారసు లేక తెచ్చుకోవాలి. లేకపోతే శ్రీవారి దర్శనం దుర్లభం అవుతుంది. ఎంత డబ్బు ఉన్న వారికైనా ఇలాంటి పరిస్థితి తప్పదు. అందుకే టీటీడీ కొన్ని వినూత్న విరాళల సౌకర్యాలను అమల్లోకి తెస్తోంది.
రూ.కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం
తాజాగా తిరుమల శ్రీవారికి రూ. కోటి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. రూ. కోటి విరాళం ఇచ్చే దాతలకు జీవితకాలం పాటు నలుగురికి ప్రతి ఏడాది క్రింది సౌకర్యాలను కల్పిస్తారు. సంవత్సరంలో 3 రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు బ్రేక్ దర్శనం, 4 రోజుల పాటు సుపథం ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం సౌకర్యాలు కల్పిస్తారు. వీటితోపాటు 10 పెద్ద లడ్డూలు, 20 చిన్న లడ్డూలు, 1 దుప్పట, 1 రవికే, 10 మహా ప్రసాదం ప్యాకెట్లు, ఒకసారి వేద ఆశీర్వచనం అవకాశం కల్పిస్తారు. వీటితో పాటుగా రూ. 3 వేలు రుసుం విలువ చేసే వసతి గదుల సదుపాయం 3 రోజులు ఇస్తారు. జీవిత కాలంలో ఒకసారి దాతకు ఒక 5 గ్రాముల శ్రీవారి బంగారు డాలర్ మరియు ఒక 50 గ్రాముల సిల్వర్ డాలర్ ఇస్తారు. తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు జరిగే రోజులలో మినహా మిగిలిన రోజులలో మాత్రమే కల్పిస్తారు.
కోటిన్నర విరాళానికి ఉదయాస్తమానసేవ
ఇది కాకుండా కోటిన్నర చెల్లిస్తే ఉదయాస్తమాన సేవకు అవకాశం కల్పిస్తారు. ఉదయ అంటే సూర్యోదయం & అస్తమానం అంటే సూర్యాస్తమయం. ఉదయస్థమాన సేవ అంటే సూర్యోదయం నుండి ఆలయం మూసివేయడం వరకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలలో పాల్గొనడం. 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు మినహా ప్రతి దాత ఉదయస్థమాన సేవా టికెట్ ద్వారా పాల్గొనవచ్చు. ప్రతి సంవత్సరం దాతలు వారు కోరుకున్న తేదీలలో ఆలయాన్ని సందర్శించవచ్చు. టికెట్ హోల్డర్లకు ఆలయంలోని అన్ని ఆర్జిత సేవలు, దర్శనాలు మరియు పూజలకు ప్రత్యేక ప్రోటోకాల్ ఎంట్రీ ఇస్తారు.
శ్రీవారి దర్శన సేవలకు విపరీతమైన డిమాండ్
శుక్రవారం ఎంపిక చేసుకున్న దాతలకు శుక్రవారం నాడు శ్రీవారికి ప్రత్యేక అభిషేకం మరియు ఇతర అన్ని సేవలకు అనుమతి ఉంటుంది. శుక్రవారం విరాళం మొత్తం 1.5 కోట్ల రూపాయలు మరియు మిగిలిన రోజులలో 1 కోటి రూపాయలు. శ్రీవారి అభిషేక సేవ 90 నిమిషాలకు పైగా జరుగుతుంది.ఉదయస్థమాన సేవా విరాళాల చెల్లుబాటు 25 సంవత్సరాలు ఉంటుంది. దాతలు నామినేట్ చేయబడిన వ్యక్తులకు హాజరు కాలేకపోతే వారి దర్శన టిక్కెట్లను బదిలీ చేసుకునే అవకాశం ఉంది. కోటి..కోటిన్నర విలువ చేసే ఈ రెండు విరాళాలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఉదయాస్తమాన సేవ టిక్కెట్ల కోటా అయిపోయినట్లుగా వెబ్ సైట్ చూపిస్తోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

