Tirumala News: తిరుమల శ్రీవారి ఆలయం క్యూ లైన్లో కొట్టుకున్న భక్తులు, వీడియో వైరల్
Andhra Pradesh News | కలియుగ దైవం తిరుమల శ్రీవారి క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. వేసవి కావడంతో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. శనివారం క్యూ లైన్లో భక్తులు కొట్టుకున్నారు.

Devotees clash in queue in front of Tirumala Srivari Temple | తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం ముందు క్యూ లైన్ లో అపశ్రుతి జరిగింది. భక్తులు గొడవకు దిగి కొట్టుకున్నారు. శనివారం సాయంత్రం క్యూలైన్లో చిన్న పిల్లలతో వస్తున్న మహిళలను తోటి భక్తులు తోసి వేశారు. దాంతో గొడవ మొదలైంది. పిల్లలతో వస్తున్న మహిళను ఎలా తోసివేస్తావంటూ తోటి భక్తులతో ఈమె బంధువులు గొడవకు దిగారు. అక్కడే ఉన్న విజిలెన్స్, పోలీస్ సిబ్బంది వారిని అదుపు చేసేందుకు ఎంత ప్రయత్నించినా భక్తులు వినకుండా క్యూ లైన్లోనే భక్తులు కొట్టుకున్నారు. శ్రీవారి ఆలయ పేష్కార్ రామకృష్ణ భక్తులకి ఎంత సర్ది చెప్పినా వినకుండా గొడవకు దిగారు. వెంటనే విజిలెన్స్ అధికారులు క్యూలైన్ వద్దకి చేరుకొని భక్తుల్ని పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పడంతో గొడవ సద్దమణిగింది.

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రానికి భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగతోంది. అసలే స్కూళ్లు, కాలేజీలకు సైతం వేసవి సెలవులు ఇవ్వడంతో తిరుమలకు భక్తులు పోటెత్తుతున్నారు. ఇటీవల ఏపీ, తెలంగాణలో టెన్త్, ఇంటర్ ఫలితాలు కూడా విడుదల అనంతరం తిరుమలలో రద్దీ పెరిగింది. తమ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం చిన్నపిల్లలతో వస్తున్న మహిళను పొరపాటున వేరే భక్తులు తోసివేయడంతో గొడవ జరిగింది. మహిళను తోసేస్తారా అంటూ ఆమె తరఫు వారు గొడవపడ్డారు. భక్తులు కొట్టుకోవడంతో వెంటనే పోలీసులు, విజిలెన్స్ అధికారులు వారిని వారించి క్యూ లైన్ వద్ద పరిస్థితి సద్దుమణిగేలా చేశారు.
అసలే వీకెండ్ కావడంతో శనివారం, ఆదివారాల్లో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది. ఓ వైపు వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల రద్దీ పెరుగుతుందని, వీఐపీ బ్రేక్ దర్శనాలలో టీటీడీ ఇటీవల మార్పులు చేసింది. మే 01 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో కొంచెం టైమింగ్ మారింది. వేసవి సెలవుల రద్దీ కారణంగా తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు మాత్రమే మే 1వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలు పరిమితం చేసింది టీటీడీ. ఈ మేరకు టీటీడీ ఇటీవల ఓ ప్రకటన విడుదల చేసింది.
అసలే తల్లిదండ్రులతో కలిసి పిల్లలు వేసవిలో శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున వస్తుంటారు. తిరుమలకు వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించాలని టీటీడీ బోర్డు భావించింది. మే 1 నుంచి జూలై 15 వరకు తిరుమలకు స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలు పరిమితం చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ఉదయం 6 నుంచి అమలు చేస్తోంది టీటీడీ.






















