Lance Naik Sai Teja: చిత్తూరుకు చేరుకున్న సాయితేజ పార్థివదేహం.. భారీ ర్యాలీగా సొంతూరుకు తరలింపు
లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం బెంగళూరు నుండి చిత్తూరుకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా సాయితేజ స్వగ్రామమైన ఎగువరేగడకు ర్యాలీగా తరలిస్తున్నారు.
Lance Naik Sai Teja: తిరుపతి : ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన లాన్స్ నాయక్ సాయితేజ పార్థివదేహం బెంగళూరు నుండి చిత్తూరుకు చేరుకుంది. నిన్న రాత్రి బెంగళూరులోని ఎలహంక ఆర్మీ బేస్ క్యాంప్‌నకు చేరుకోగా.. నేటి ఉదయం రోడ్డు మార్గం ద్వారా చిత్తూరు జిల్లాకు చేరుకుంది. పుంగనూరు రోడ్డు మార్గం గుండా సాయితేజ స్వగ్రామమైన ఎగువరేగడకు ర్యాలీగా తరలిస్తున్నారు. చిత్తూరుకు చేరుకోగానే ముందుగా అభిమానులు,స్నేహితులు నివాళులు అర్పించిన తరువాత ర్యాలీ ప్రారంభంమైంది. దేశం కోసం ప్రాణాలను అర్పించిన సాయితేజకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు.
జవాను సాయితేజ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నేడు నిర్వహించనున్నారు. మరికాసేపట్లో సాయితేజ భౌతికకాయం స్వగ్రామం ఎగువరేగడకు చేరుకుంటుంది. కుటుంబ సభ్యులు, అభిమానుల సందర్శనార్ధం ఉంచి మధ్యాహ్నం 12 గంటలకు ఎగువరేగడి గ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారు. మరోవైపు సాయితేజ నివాసం వద్ద అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సైనిక లాంఛనాలతో సాయితేజకు కడసారి తుది వీడ్కోలు పలకనున్నారు. దాదాపుగా ఐదు రోజుల అనంతరం సాయితేజ పార్ధిదేహం స్వగ్రామంకు చేరుకుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయితేజకు కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు.
ఇటీవల తమిళనాడుతో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ ఆయన సతీమణి సహా 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో సీడీఎస్ వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అయిన సాయితేజ సైతం చనిపోయారు. బుధవారం ఈ విషాదం చోటుచేసుకోగా డీఎన్ఏ టెస్టుల్లో శనివారం సాయితేజ భౌతికకాయాన్ని గుర్తించినట్లు ఆర్మీ వెల్లడించింది. నిన్న ఒక్కరోజు మొత్తం ఆరుగురు జవాన్ల భౌతికకాయాలను గుర్తించారు.
మొదట లాన్స్ నాయక్ సాయితేజ, మరో లాన్స్ నాయక్ వివేక్ కుమార్ భౌతికకాయాలను గుర్తించినట్లు ప్రకటించారు. మరో నలుగురు ఐఏఎఫ్ సిబ్బంది మృతదేహాలను డీఎన్ఏ టెస్టుల ద్వారా గుర్తించారు. జేడబ్ల్యూఓ ప్రదీప్, వింగ్ కమాండర్ పీఎస్ చౌహాన్, జేడబ్ల్యూఓ ప్రతాప్ దాస్, స్క్వాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్ మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు శనివారం ఉదయం ప్రకటించారు. కుటుంబసభ్యులను మృతదేహాలను అప్పగించి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
Also Read: Lance Naik Sai Teja: బెంగళూరు బేస్ క్యాంపునకు సాయితేజ భౌతికకాయం.. రేపు స్వగ్రామానికి తరలింపు, అంత్యక్రియలు
Also Read: Gen Bipin Rawat Last Rites: వీడ్కోలు వీరుడా.. ముగిసిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు