Tirupati News : తిరుపతిలో షాకింగ్ ఘటన, నడిరోడ్డుపై శిశువుకు జన్మనిచ్చిన గర్భిణీ!
Tirupati News : తిరుపతిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై నిండు గర్భిణీ శిశువుకు జన్మనిచ్చింది.అయితే ఆమె మతిస్థిమితంలేని మహిళ అని తెలుస్తోంది.
Tirupati News : మతిస్థిమితం లేని ఓ మహిళ నడిరోడ్డుపై ఆడ శిశువుకు జన్మ నిచ్చిన ఘటన తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి కూత వేటు దూరంలో చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పారామెడికల్ ఉద్యోగి మహిళకు ఎటువంటి అపాయం కలుగకుండా ప్రసవించేలా సహాయం చేశారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకుని మహిళకు సహాయక చర్యలు అందించారు ప్రసూతి ఆసుపత్రి వైద్యులు. అనంతరం శిశువును, మహిళను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్య సేవలు అందించారు.
అసలేం జరిగింది?
తిరుపతి నగరంలో మతిస్థిమితం లేకుండా సంచరిస్తున్న ఓ మహిళ ..ఆదివారం ఉదయం నుంచి ప్రసూతి ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. ఆ మహిళ గర్భవతి అని ఎవరూ గుర్తించ లేకపోయారు. అక్కడక్కడే తిరుగుతున్న మహిళ ఆసుపత్రికి వెళ్తే ఆమె వెంట సహాయకులు లేకపోవడంతో.. ఆ మతిస్థిమితం లేని మహిళను ఆసుపత్రిలో చేర్చుకునేందుకు ప్రసూతి ఆసుపత్రి సిబ్బంది నిరాకరించారు. దీంతో మహిళ అక్కడక్కడే తిరుగూ ఉండగా ఆమెకు అక్కడ ఉంటే స్థానికులు ఆహారం అందించారు. ఆహారం తీసుకున్న ఆమె కొద్ది సేపటికే ప్రసవ వేదనకు గురి కావడంతో స్థానికులు ఏం జరిగిందని ఆమెను ప్రశ్నించారు. అప్పటికే ఆమె గర్భం నుంచి శిశువు తల బయటకు రావడాన్ని గమనించిన స్థానికులు ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. అయితే అదే సమయంలో అటుగా వెళ్తోన్న పారామెడికల్ సిబ్బంది స్పందించి ఆమెకు అవసరం అయ్యే వైద్య సేవలు అందించారు. అక్కడికి చేరుకున్న ప్రసూతి ఆసుపత్రి డాక్టర్, సిబ్బంది మహిళ సురక్షితంగా ప్రసవించేందుకు సహకరించారు. దీంతో మతిస్థిమితం లేని మహిళ పండంటి ఆడ శిశువుకు జన్మ నిచ్చింది. శిశువు ఆరోగ్యంగా ఉండంతో తల్లీ బిడ్డను ఆసుపత్రిలో చేర్చుకుని వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై ఆసుపత్రి వర్గాలు ఎటువంటి వివరణ ఇవ్వక పోవడం గమనార్హం.
రైల్వే స్టేషన్ లో గర్భిణీ ప్రసవం
పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ఇటీవల గర్భిణీ ప్రసవించింది. బెంగళూర్ నుంచి బెనారస్‌కు యశ్వంత్‌పూర్-దానాపూర్ రైల్ లో అనితాదేవి, సోదరుడు వినయ్‌కుమార్, పిల్లలతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యలో అనితాదేవికి పురిటి నొప్పులు రావడంతో వెంటనే ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో ట్రైన్ ఆపారు. అప్పటికే సమాచారం అందుకున్న 108 సిబ్బంది రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. పురిటి నొప్పులు అధికం కావడంతో వైద్య సిబ్బంది అంబులెన్స్ లోనే పురుడు పోశారు. అనితాదేవి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలిపారు. అనంతరం తల్లీ బిడ్డను పెద్దపల్లి మతాశిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
గర్భిణీపై విష ప్రయోగం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇటీవల ఆరు నెలల గర్భిణీ శ్రావణి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుడుతుందనే ఉద్దేశంతో అత్తింటివాళ్లు శ్రావణికి గడ్డి మందు ఇచ్చారు. దీంతో ఆమె చనిపోయిందని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయమై శ్రావణి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బల్లికురువ మండలం కుప్పరపాలెం గ్రామానికి చెందిన శ్రావణికి రొంపిచర్ల మండలం సబ్బయ్యపాలెం గ్రామానికి గాడిపర్తి వేణుతో మూడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి మొదటి సంతానం ఆడపిల్ల పుట్టింది. శ్రావణి మరోసారి గర్భం దాల్చగా ఈనెల 2న శ్రావణికి స్కానింగ్ చేయించారు. స్కానింగ్ జరిగిన నాలుగు రోజుల తర్వాత శ్రావణికి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను ఆసుపత్రిలో చేర్చి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. అత్తింటివాళ్లు. అయితే శ్రావణిపై విష ప్రయోగం జరిగిందని వైద్యులు గుర్తించారు. తమ కూతురు అస్వస్థతకు గురికావడానికి అత్తింటివారే కారణమని శ్రావణి బంధువులు ఆరోపించారు. శ్రావణికి రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టే అవకాశం ఉందని ఆమెపై విష ప్రయోగం చేశారనే అనుమానం వ్యక్తం చేశారు. శ్రావణి భర్తకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ కారణంగా శ్రావణిని అడ్డు తొలగించుకొనే ప్రయత్నం చేశారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.