Tirumala Arjitha Seva Tickets: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - మే నెల ఆర్జిత సేవా టికెట్లు విడుదల తేదీలివే!
Tirumala News: ఈ నెల 19న మే నెల కోటాకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Tirumala Srivari Arjitha Seva Tickets For May Month: తిరుమల (Tirumala) శ్రీవారి భక్తుల కోసం మే నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల (Arjitha Seva Tickets) కోటాను ఈ నెల 19న (సోమవారం) ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అలాగే, సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 21న ఉదయం 10 గంటల వరకూ ఆన్ లైన్ లో నమోదు చేసుకోవచ్చని పేర్కొంది. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్ లో టికెట్లు మంజూరవుతాయి. ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. అటు, తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్ లోని 5 కంపార్ట్ మెంట్స్ నిండాయి. శనివారం 71,021 మంది స్వామి వారిని దర్శించుకోగా.. 25,965 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోందని.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో స్వామి దర్శన భాగ్యం లభిస్తోందని అధికారులు తెలిపారు. శ్రీవారి హుండీ ఆదాయం శనివారం రూ.4.17 కోట్లు వచ్చినట్లు చెప్పారు.
ఈ నెల 22న వర్చువల్ సేవా టికెట్లు
ఈ నెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవాటికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన మే నెల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
- ఈ నెల 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటా జారీ చేస్తారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల.. బ్రేక్ దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
- ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మే నెల ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 కోటా టికెట్లు, అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్ విడుదల చేస్తారు.
- అలాగే, ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మే నెలకు తిరుమల, తిరుపతికి చెందిన శ్రీవారి సేవా కోటా, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవా కోటా, మధ్యాహ్నం పరకామణి సేవా కోటా టికెట్లు విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in సైట్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ తెలిపింది.
వయో వృద్ధుల కోసం
వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాదులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈ నెల 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని అధికారులు తెలిపారు.