Amaravati Issue : గెలిచినా ఓడుతున్న అమరావతి రైతులు - వెయ్యి రోజుల ఉద్యమ ఫలితం ఏమిటి?
అమరావతికి పైసా ఆశించకుండా భూములిచ్చిన రైతులు రోడ్డున పడి వెయ్యి రోజులయింది. రాజ్యాంగం, న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు కూడా వారికి భరోసా ఇవ్వలేకపోతోంది.
Amaravati Issue : అమరావతి రైతులు ఉద్యమం ప్రారంభించి వెయ్యి రోజులవుతోంది. దక్షిణాఫ్రికాలో మూడు రాజధానులున్నాయని.. ఏపీకీ అవసరమేనని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పటి నుండి రైతులు ఉద్యమం ప్రారంభించారు. మూడు రాజధానుల ప్రకటన పాతికవేల మంది భూములిచ్చిన రైతుల గుండెల్లో అణుబాంబులా పడింది అప్పట్నుంచి ఆ రైతులు పడాల్సిన కష్టాలన్నీ పడ్డారు. కులం ముద్ర వేశారు. పెయిడ్ ఆర్టిస్టులన్నారు. కేసులు పెట్టారు. లాఠీలతో కుళ్లబొడిచారు. అయినా వారు ఉద్యమం చేస్తూనే ఉన్నారు. చివరికి న్యాయపోరాటం చేసి అనుకూల తీర్పు తెచ్చుకున్నారు. కానీ ఇప్పటికీ వారికి ఊరట లేదు. ఎందుకంటే ప్రభుత్వం హైకోర్టు తీర్పును శిరసావహించడానికి సిద్ధంగా లేదు.
వెయ్యి రోజుల ఉద్యమంలో విజేతలు రైతులే !
అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు తన తీర్పు చెప్పింది. సీఆర్డీఏ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తీర్మానించింది. ఓ రకంగా అసాధారణ తీర్పు ఇచ్చింది. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి శాసనపరమైన నిర్ణయాలు తీసుకోకూడదని " రిట్ ఆఫ్ మాండమస్ " ఇస్తూ తీర్పు చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ రాజధాని విషయంలో ఎలాంటి చట్టాలు ఇక ప్రభుత్వం చేయలేదు. మాండమస్ రిట్ ను అంతిమ ప్రత్యామ్నాయంగానే కోర్టులు వినియోగించాలనే నిబంధన ఉంది. అమరావతి విషయంలో ఇంతకు మించి రైతులకు న్యాయం చేయడానికి వేరే దారి లేదని హైకోర్టు భావించినట్లుగా కనిపిస్తోంది. ఈ ప్రకారం చూస్తే న్యాయదేవత రైతుల వైపు ఉంది.
90 శాతం చిన్న సన్నకారు రైతులే !
ప్రపంచంలో అన్ని చోట్లా తమ భూములు తీసుకోవద్దని రైతులు పోరాటాలు చేస్తూంటారు. కానీ ఒక్క ఏపీలో స్వచ్చందంగా భూమూలు ఇస్తే రోడ్డున పడేశారని ఆందోళనలు చేస్తున్నారు. రోజులు కాదు.. వారాలు కాదు... నెలల తరబడి చేస్తూనే ఉన్నారు. అమరావతి రైతుల ఉద్యమానికి వెయ్యి రోజులు వచ్చాయి. అక్కడ వందల ఎకరాలు ఉన్న భూస్వాములు ఎవరూ లేరు. కనీసం పాతిక ఎకరాలు ఉండే.. ధనవంతులు ఒక్క శాతం కూడా ఉండరు. ఒకటి నుండి.. ఐదు ఎకరాల్లోపు ఉన్న రైతులే తొంభై శాతం మంది ఉన్నారు. ప్రభుత్వానికి 33, 771 ఎకరాలను రాజధాని కోసం రైతులు ఇచ్చారు. ఇలా ఇచ్చిన రైతుల సంఖ్య 29754. అంటే.. దాదాపుగా ఒక్కొక్క రైతు.. ఒక్కొక్క ఎకరానికి కొద్దిగా ఎక్కువ మాత్రమే సగటున ప్రభుత్వానికి ఇచ్చారు. 29 గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి. ఇంకా డీటైల్డ్ గా చూసుకుంటే.. ఒకటి నుంచి రెండున్నర లోపు ఎకరాలను అమరావతి కోసం త్యాగం చేసిన రైతులు 6,278 మంది, రెండున్నర నుంచి ఐదు ఎకరాల్లోపు ఇచ్చిన వారు 2,131 మంది, ఐదు నుంచి పది ఎకరాలలోపు ఇచ్చిన వారు 765 మంది. పది నుంచి ఆపై ఎకరాలు ఇచ్చిన వారు వందల్లో కూడా లేరు. 69 శాతం మంది రైతులు ఎకరంలోపు ఇచ్చారు. వీరంతా..నిరుపేద రైతులు. భూములు ఇచ్చినవారిలో 90 శాతం మంది రెండున్నర ఎకరాలలోపు ఉన్నవారే. కేవలం 3.3 శాతం మంది మాత్రమే.. ఎగువ మధ్యతరగతి, ధనికవర్గాలు. సామాజికపరంగా చూసుకుంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు 75 శాతం ఉన్నారు. మిగిలిన పాతిక శాతంలో కమ్మ, రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ వంటి అగ్రకులాలకు చెందినవారున్నారు.
అమరావతిని రాజధానిగా చూడలేకపోతున్న ప్రభుత్వం !
అమరావతి విషయంలో గత ప్రభుత్వం పక్కా ప్రణాళికలు వేసుకుంది. రాజకీయ కారణాలో.. సామాజిక కారణాలో కానీ.. జగన్మోహన్ రెడ్డి అమరావతిని నిర్వీర్యం చేయాలనుకోవడం వల్ల సమస్య ప్రారంభమయింది. అమరావతిని ఏదో విధంగా నిర్వీర్యం చేయాలని సీఎం జగన్ అనుకున్నారు. కానీ సాధ్యం కాలేదు. ఆనేకానేక ప్రయత్నాలు చేశారు. రైతులు న్యాయస్థానాలు చుట్టూ తిరిగారు. ప్రభుత్వం చట్టాలను కూడా ఉల్లంఘించి బిల్లులు తెచ్చారు. కానీ ఆ బిల్లులు నిలబడవని తెలిసి వెనక్కి తగ్గారు. ఇప్పుడు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది . రైతుల హక్కులను కాపాడాలని తేల్చేసింది. కానీ ఇప్పటికీ ప్రభుత్వం పాత పంథాలోనే ఉంది. అమరావతిని అంగీకరించే ప్రశ్నే లేదని చెబుతోంది.
గెలిచినా ఓడుతున్న రైతులు !
చట్టపరంగా.. న్యాయపరంగా రైతులు విజయం సాధిస్తున్నారు. ఒక్క అధికార పార్టీ తప్ప అన్ని వర్గాలు అమరావతి రైతుల వైపే ఉన్నాయి. ఈ ధైర్యంతో వారు పోరాడుతున్నారు. రాజ్యాంగం అండగా ఉంటుందని ఆశపడుతున్నారు. కానీ ఇప్పటికీ వారికి అలాంటి ధైర్యం కలగడం లేదు. అందుకే వెయ్యి రోజులవుతున్న సందర్భంగా అమరావతి నుంచి అరసవిల్లికి పాదయాత్ర చేపట్టారు. ఈ మధ్యలో ఎన్ని జరగుతాయో.. ఈ పోరాటంలో విజయం సాధిస్తారో.. లేదో కాలమో నిర్ణయించాలి.