Pedda Reddy house controversy in Tadipatri: తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇల్లు కూల్చివేతకు రంగం సిద్ధం - మున్సిపల్ స్థలం ఆక్రమించి కట్టారని నిర్ధారణ !
Tadipatri: తాడిపత్రి పెద్దారెడ్డి ఇల్లు మున్సిపల్ స్థలం ఆక్రమించి కట్టారని తేలింది. మున్సిపల్ స్థలంలో కట్టడాలను పెద్దారెడ్డి కూల్చివేస్తారా.. మున్సిపల్ అధికారులా అన్నది తేలాల్సి ఉంది.

Tadipatri Peddareddy House was built on municipal land: అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి సర్వేను మున్సిపల్ అధికారులు పూర్తి చేశారు. ఈ సర్వేలో పెద్దారెడ్డి ఇంటి నిర్మాణానికి మున్సిపల్ భవన అనుమతి లేనట్టు తేలింది. అదనంగా, ప్లాట్ నెంబర్ 2, 16లో నిర్మాణం 10 సెంట్ల స్థలంలో జరగాల్సి ఉండగా, 12 సెంట్లలో ఇంటిని నిర్మించినట్టు గుర్తించారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోనున్నట్టు తాడిపత్రి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుజాత తెలిపారు.
తాడిపత్రి మున్సిపల్ పరిధిలోని 15వ వార్డులో సర్వే నెంబర్ 639, 640, మరియు 641లో ఉన్న ప్లాట్ నెంబర్ 1 నుంచి 16 వరకు స్థలాలను మున్సిపల్, రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సర్వేలో, పెద్దారెడ్డి ఇంటి నిర్మాణం మున్సిపల్ స్థలంలో ఆక్రమణకు గురైనట్టు ఆరోపణలు వచ్చాయి. పెద్దారెడ్డి ఇంటి నిర్మాణానికి భవన అనుమతి లేదని ప్రాథమిక సర్వేలో తేలింది. ప్లాట్ నెంబర్ 2, 16లో 10 సెంట్ల స్థలంలో నిర్మాణం జరగాల్సి ఉండగా, 12 సెంట్లలో ఇల్లు నిర్మించారు. ఈ అదనపు 2 సెంట్ల ఆక్రమణపై నివేదికను ఉన్నతాధికారులకు సమర్పిస్తాము. వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుజాత ప్రకటించారు.
YSRCP నేతలు ఈ సర్వేను "కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు"గా వర్ణిస్తున్నారు. "పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు TDP కుట్ర చేస్తోంది. ఇది రాజకీయ వేధింపుల్లో భాగం," అంటున్నారు. "మున్సిపల్ స్థల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరైనా సరే, చట్టవిరుద్ధ నిర్మాణాలు ఉంటే కూల్చివేస్తాము," అని మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. సర్వే నివేదికను మున్సిపల్ కమిషనర్‌కు సమర్పిస్తారు. ఈ నివేదికలో పెద్దారెడ్డి ఇంటి నిర్మాణం మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించినట్టు ధృవీకరిస్తే, కూల్చివేత లేదా జరిమానా వంటి చర్యలు తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ 2017 ప్రకారం, ఏదైనా నిర్మాణానికి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి అనుమతి తప్పనిసరి. ఈ అనుమతి లేకుండా నిర్మాణం జరిగితే, అది చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు.
తాడిపత్రి రాజకీయాలు ఎప్పుడూ ఉద్రిక్తంగా ఉంటాయి. తాడిపత్రి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న పెద్దారెడ్డికి, జేసీవర్గానికి చాలాకాలం కిందట నుంచి ఫ్యాక్షన్ గొడవలు ఉన్నాయి. తర్వాత సద్దుమణిగాయి. శింగనమల నియోజకవర్గంలో సొంత గ్రామం ఉన్న పెద్దారెడ్డి ఆ నియోజకవర్గం రిజర్వుడు కావడంతో తాడిపత్రిలో పోటీ చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆయన ఇల్లు కట్టుకున్నారు. పది సెంట్ల స్థలం కొనుగోలు చేసి..రెండు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి పన్నెండు సెంట్లలో ఇల్లు కట్టడం వివాదాస్పదమయింది. మున్సిపల్ చైర్మన్ గా టీడీపీ నేత ప్రభాకర్ రెడ్డి ఉండటంతో.. పట్టుదలగా .. ఆ నిర్మాణాన్ని కూల్చివేయాలని ప్రయత్నిస్తున్నారు.





















