Andhra News: సీఎం వద్దకు తాడిపత్రి - జమ్మలమడుగు ఫ్లైయాష్ వివాదం - జమ్మలమడుగు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
Flyash Contract: థర్మల్ ప్రాజెక్ట్ ఫ్లైయాష్ వివాదం సీఎం చంద్రబాబు వద్దకు చేరింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి ఆయనతో సమావేశమయ్యారు.
CM Chandrababu On Tadipatri - Jammalamadugu Dispute: రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (ఆర్టీపీపీ) ఫ్లైయాష్ వివాదం సచివాలయానికి చేరింది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపుతో జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి (Adinarayana Reddy), భూపేష్ రెడ్డి సచివాలయానికి వచ్చి సీఎంతో సమావేశమయ్యారు. తాను జ్వరం వల్ల హాజరు కావడం లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి (JC Prabhakar Reddy) సమాచారం ఇచ్చారు. ఫ్లైయాష్ కాంట్రాక్టులో నేతల మధ్య వివాదంతో కూటమి ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ జరిగింది
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో బూడిదను అప్పటి జమ్మలమడుగు, తాడిపత్రి ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, పెద్దారెడ్డిలు సిమెంట్ పరిశ్రమలకు సరఫరా చేసేవారు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బూడిదను తరలించడం ప్రారంభించారు. దీనిపై ఇటీవల ఆదినారాయణరెడ్డి వర్గీయులు అడ్డు చెప్పడంతో వివాదం ముదిరి పాకాన పడింది. ఆదినారాయణరెడ్డి వర్గీయులు సరఫరా చేసే బూడిదను తాడిపత్రి పరిసరాల్లోని సిమెంట్ పరిశ్రమలకు సరఫరా కాకుండా ప్రభాకర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగగా.. పంచాయతీ సీఎం వద్దకు చేరింది. ఆయన వారితో చర్చించారు.
'ఉపాధి కల్పనకే తీసుకెళ్తున్నాం'
కాగా, సీఎంతో సమావేశమైన అనంతరం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మీడియాతో మాట్లాడారు. 'థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చే బూడిద (ఫ్లైయాష్) పూర్తిగా ఉచితం. పీఎంఈజీపీలో భాగంగా స్థానికులకు ఉపాధి కల్పించేందుకు దీన్ని తీసుకెళ్తున్నాం. ఈ అంశాలపై సీఎం ఆదేశాల మేరకు వచ్చి వివరణ ఇచ్చాం. జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం పెద్ద లేఖ రాశారు. లేఖ రాసిన వారు స్వయంగా రావాలి కదా.?. విలువ లేని ఫ్లైయాష్ గురించి వివాదం తీసుకొచ్చారు. బూడిదను దూరంగా తీసుకెళ్లడం దేనికి.?. స్థానికులకు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇవ్వాలని సీఎంకు తెలిపాం. దీనిపై మా వివరణ విన్న సీఎం.. పోలీస్, రెవెన్యూ, ఇంటెలిజెన్స్ అందరి నుంచి వివరాలు తెలుసుకుని వివాదం పరిష్కరిస్తామన్నారు. అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమ ఆయన ప్రాంతంలో ఉంది కాబట్టే ఫ్లైయాష్ అడుగుతున్నారు. ఏదైనా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా సీఎం వద్దకు వచ్చి పూర్తి వివరాలు ఇవ్వాలి. కానీ ఎందుకు రాలేదు.?. లేఖ మాత్రమే ఇచ్చి ఊరుకున్నారు.' అని ఆదినారాయణరెడ్డి ప్రశ్నించారు.
ఈ సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఆయన ఇలాకాలో అల్ట్రాటెక్ పరిశ్రమ ఉంది. అయితే, థర్మల్ విద్యుత్ కేంద్రం మాత్రం జమ్మలమడుగు పరిధిలో ఉంది. అక్కడి నుంచి ఫ్లైయాష్‌ను తాడిపత్రికి సమీపంలోని సిమెంట్ పరిశ్రమకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఒక నియోజకవర్గంలో బూడిద దొరుకుతుండగా.. మరో నియోజకవర్గంలోని పరిశ్రమకు ఇది ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే నేతల మధ్య బూడిద తరలింపు విషయంలో వివాదం నెలకొంది.
Also Read: YS Jagan: జనవరి నుంచి జగన్ జిల్లాల పర్యటన - కష్టపడేవారికే భవిష్యత్ - పార్టీ నేతలకు జగన్ సందేశం