Srikakulam: సిక్కోలు ఏజెన్సీలో భయం.. భయం.. వణికిపోతున్న జనం, కారణం ఏంటంటే..
శ్రీకాకుళం గిరిజన తండాలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. కలుషిత నీటికి తోడు తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు.
సిక్కోలు ఏజెన్సీని విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా వంటి వైరల్ ఫీవర్లతో గిరిజన తండాలు మంచాన పడుతున్నాయి. తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో పాటు అడవి బిడ్డల్లో అవగాహన లేకపోవడంతో రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఏడాది ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యానికి వైద్య ఆరోగ్యశాఖ అలసత్వం కూడా తోడవడంతో గిరిజనుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.
శ్రీకాకుళం గిరిజన తండాలు విష జ్వరాల కోరల్లో చిక్కుకున్నాయి. కలుషిత నీటికి తోడు తండాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో గిరిజనులు రోగాల బారినపడుతున్నారు. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొన్ని గ్రామాల్లో గిరిజనులు టైఫాయిడ్ వంటి విష జ్వరాల వ్యాధుల బారినపడుతుంటే మరికొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం క్షీణించడంతో దోమలు స్వైర విహారం చేస్తూ మలేరియా వంటి వ్యాధులను కలగజేస్తున్నాయి. దీంతో ఇంటికొకరు చొప్పున మంచాన్ని పడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలా కుటుంబాలు మాడిన కడుపులతోనే జ్వరాలతో బాధ పడుతున్నారు. వారాల తరబడి జ్వరం పీడిస్తున్నా దేవుడిపై భారం వేసి పేదలంతా మంచాలకే పరిమితమవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని బతుకులకు విషజ్వరాలు తోడవడంతో అక్కడ మరణాలు నిత్యకృత్యమవుతున్నాయి.
తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విష జ్వరాలతో పరిస్థితులు దారుణంగా మారుతున్నా అటు ఐటీడీఏ అధికారులు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గాని అటువైపుగా కన్నెత్తి కూడా చూడటం లేదు. ఎపిడమిక్ సీజన్‌లో ప్రతి గిరిజన గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని చెప్పిన అధికారులు రహదారి మార్గాలున్న గ్రామాలకు వెళ్ళి మమ అనిపించారు తప్ప మారుమూల గ్రామాల వైపు చూడలేదు. దీనితో మారుమూల గ్రామాల గిరిజనులు కనీస వైద్య సదుపాయం అందక విష జ్వరాలతో బాధపడుతున్నారు. రోజుల పాటు జ్వరాలు పీడిస్తున్నా వారికి తెలిసిన వైద్యంతో సరిపెట్టుకుంటున్నారు.
సమీప ఆసుపత్రులకు వెళ్దామన్నా కనీస రోడ్డు మార్గం లేకపోవడంతో తెలిసి తెలియని వైద్యంతో కాలం గడుపుతున్నారు. చివరకు ప్రాణం మీదికి వచ్చిన తరువాత డోలీలు కట్టుకుని ఆసుపత్రులకు వెళ్ళేసరికి పుణ్య కాలం కాస్తా పూర్తయిపోతుంది. కనీసం వైద్య సదుపాయం అందక రోజుల తరబడి తండాల్లో మగ్గడం వల్ల వ్యాధి తీవ్రత ఎక్కువై చివరకు ఆసుపత్రులకు వచ్చిన తరువాత ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనికి కొత్తూరు మండలం ఎగువ దొండమానుగూడ గ్రామంలో ఇటీవల జరిగిన సంఘటనలు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
Also Read: Pccharam Corona : తెలంగాణ స్పీకర్ పోచారంకు కరోనా ! తెలుగు రాష్ట్రాల సీఎంలకు తప్పని టెన్షన్ !
Also Read : సుజనా ఫౌండేషన్ సీఈవో హత్య ? బెంగళూరు రైల్వే ట్రాక్‌పై మృతదేహం !
Also Read : సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?