(Source: Matrize)
Revanth Reddy: సాయం కోసం రైతు కుటుంబాలు కన్నీళ్లు పెడుతున్నాయి.. వాళ్లే భారమయ్యారా?
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై బుధవారం, గురువారం రెండు రోజులపాటు నిరసన తెలపాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.
ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై రెండ్రోజులపాటు ప్రదర్శనలు, వినతి పత్రాలు సమర్పణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయాలని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పోరాటం ఉద్ధృతం చేయాలని పిలుపునిచ్చారు.
మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ వినతి పత్రాలు అందజేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోళ్ల విషయంలో చేస్తున్న నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారాయని ఆయన విమర్శించారు.
రైతులు ధాన్యం అమ్మకాల కోసం కల్లాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని భారీ వర్షాలకు ధాన్యం పూర్తిగా పాడైందని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రేవంత్ అన్నారు. రాష్ట్రంలో కల్లాల వద్ద రైతులు అనారోగ్యాలతో, పాములు కరిచి మృత్యువాత పడుతున్నారని వాళ్ళను కనీసం పరామర్శించిన పాపాన పోలేదని విమర్శించారు. సాయం కోసం రైతు కుటుంబాలు కోర్టు ముందు కన్నీళ్లు పెడుతున్నాయని, 67 వేల మందికి పరిహారం ఇచ్చామంటున్న సర్కారుకు 3,942 మంది భారమయ్యారా? అని రేవంత్ ప్రశ్నించారు.
మళ్లీ కేసీఆర్ యూటర్న్ తీసుకుంటారు: భట్టి
ఢిల్లీలో జరిగిన రైతుల ఉద్యమంలో అమరులైన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఢిల్లీలో అమరులైన రైతులకు ఇచ్చినట్లే తెలంగాణ సాధనలో అమరులైన కుటుంబాలకు న్యాయం చేస్తానని ఏడున్నర ఏళ్ళు అవుతున్నా న్యాయం చేయలేదన్నారు.
రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు న్యాయం చేయాలా? వద్దా? అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రంపై యుద్ధానికి వెళ్లినందుకు సంతోషమని.. రైతు చట్టాలకు వ్యతిరేకంగా యుద్ధమే అని రోడ్లపై నిరసన తెలిపి- అమిత్ షాను కలువగానే యూ టర్న్ అవుతున్నారని విమర్శించారు. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ పై యుద్ధమే అని మళ్ళీ అమిత్ షా ను కలుస్తా అంటున్నారన్నారు. రాష్ట్రంలో ధాన్యం కొనేవారు లేరని.. వచ్చిన పంటంత రోడ్లపై వానలో తడుస్తుందన్నారు. కేసీఆర్ మాటమిద నిలబడాలని.. అమిత్ షాను కలవగానే యూ టర్న్ తీసుకోవద్దని భట్టి విక్రమార్క హితవు పలికారు.