YS Sharmila : చిన్నరాయి తగిలితే హత్యాయత్నం, వివేకాను గొడ్డలితో నరికితే గుండెపోటా ? షర్మిల సూటి ప్రశ్న
Andhra News : వైఎస్ వివేకా హత్య విషయంలో షర్మిల వైసీపీ తీరును ప్రశ్నిస్తూనే ఉన్నారు. చిన్న రాయి తగిలితే హత్యాయత్నం అంటున్నారని మరి ఏడు సార్లు నరికితే ఏమని ప్రచారం చేశారని ప్రశ్నించారు.
Sharmila continues to question YCP stance on YS Viveka murder : జగన్‌కు చిన్నరాయి తగిలితే.. హత్యాయత్నమని బ్యానర్ వార్త వేశారని, మరి వివేకానందను ఏడుసార్లు గొడ్డలితో నరికి చంపితే సాక్షి పత్రికకు హార్ట్‌ఎటాక్ అని ఎలా అనిపించిందో సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఏపీ పీసీసీ చీఫ్, కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. కడపలో నామినేషన్ వేసిన తర్వాత ఆమె మాట్లాడారు. కడప, పులివెందుల ప్రజలు మంచి తీర్పు ఇస్తారని నమ్మకం ఉందన్నారు. న్యాయం కోసం వైఎస్ఆర్ బిడ్డ ఒకవైపు.. నిందుతులు మరోవైపు ఉన్నారని గుర్తుచేశారు. డప జిల్లా ఓటర్లు ఇంకా వైఎస్ఆర్, వివేకానందరెడ్డిని మరిచిపోలేదని గుర్తు చేశారు. ఇక్కడి ఓటర్లు న్యాయం వైపు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, అందుకే తమను అన్ని విధాలుగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయం కోసం గొంతు ఎత్తితే అడ్డుకున్నారని విమర్శించారు. భావ ప్రకటనా స్వేచ్చకు సంకెళ్లు వేయడం ఏమిటని ప్రశ్నించారు.వైఎస్ వివేకానందరెడ్డిపై సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారంపైనా స్పందించారు. ప్రజా నాయకులకు వ్యక్తిగత జీవితం ఉండకూడదా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ చేసిన అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ఉందా అన్నారు. తండ్రిని పోగొట్టుకున్న సునీత న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాటం చేస్తోందన్నారు.
అంతకుముందు షర్మిల ఎక్స్ పోస్టును షేర్ చేస్తూ ‘‘ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను. వైఎస్. రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్. వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేని ప్రజలు, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ధర్మం వైపే మన కడప ప్రజలు నిలబడతారని ఆశిస్తోంది… మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ’’ అని పేర్కొన్నారు.
ఒక అపురూప ఘట్టం ఆవిష్కరించబోతున్న ఈ సందర్భంలో, దేవుని దీవెనలు, నాన్న ఆశీర్వాదం, నా ప్రియమైన అమ్మ, ముద్దుల బిడ్డల శుభాకాంక్షలు అందుకుని, న్యాయం కొరకు, విజయం వైపు ఈ అడుగు వేస్తున్నాను.
— YS Sharmila (@realyssharmila) April 20, 2024
వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని, వైఎస్ వివేకానంద రెడ్డి గారిని మరిచి పోలేని ప్రజలు, అందరూ… pic.twitter.com/1cBaoePyiA
శనివారం ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కలెక్టరేట్‌లోని ఆర్వోకు తన నామినేషన్ పత్రాలను అందజేశారు. షర్మిల నామినేషన్ కార్యక్రమంలో వివేకానంద కూతురు సునీత, తులసీరెడ్డి ఉన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన రోడ్ షోలో పాల్గొన్నారు.