Michaung cyclone Effect: కోనసీమకు పొంచి ఉన్న మిచాంగ్ తుపాను ముప్పు, రెడ్ అలెర్ట్ జారీ
Heavy Rains In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛాంగ్ తుపాను తీవ్ర తుపానుగా మారడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ..
Cyclone Michaung Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛాంగ్ తుపాను తీవ్ర తుపానుగా మారడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు రెడ్ అలెర్ట్ ప్రకటించింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. ఈనేపథ్యంలో జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా, జిల్లా ఎస్పీ ఎస్.శ్రీధర్‌లు పర్యవేక్షణలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.. కోనసీమ జిల్లా వ్యాప్తంగా తీరగ్రామాల్లో 37 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారడంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీచేశారు. కార్తీక మాసం కావడంతో భక్తులు సముద్ర స్నానాలు చేసేందుకు తరలివచ్చే అవకాశాలుండడంతో సముద్ర స్నానాలపై నిషేదం విధించినట్లు ఎస్సీ వెల్లడిరచారు. తుపాను వల్ల జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 1000 హెక్టార్లుకు పైగా వరిపంట నీటమునిగిన పరిస్థితి ఉందని ప్రాధమికంగా అంచనావేసింది వ్యవసాయశాఖ. చేతికందుతుందన్న పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం ఎనిమిది గంటల వరకు సగటున 35.6 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా ముమ్మిడివరంలో 70.4 మిల్లీమీటర్లు వర్షం కురిసినట్లు వెల్లడిరచారు.
ఆందోళనలో అన్నదాతలు..
రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు అన్నదాతలు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే కోతలు పూర్తయిన చేలవద్దనే ధాన్యం రాశులుగా ఉంచడంతో బరకాలు కప్పి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భారీ వర్షాలకు అవికూడా నీటమునగడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు రైతులు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంట నష్టం ప్రాధమిక అంచన వేసేందుకు వ్యవసాయశాఖ సిబ్బందితో ఇప్పటికే దెబ్బతిన్న చేలను పరిశీలన చేయిస్తోంది. పలు ప్రాంతాల్లో కల్లాల్లో ఒబ్బిడి చేసుకున్న ధాన్యం తడిచి ముద్దయిన పరిస్థితి కనిపిస్తోంది..
తీరగ్రామాల్లో ఈదురు గాలులు..
అంబేడ్కర్ కోనసీమజిల్లాలలో సుమారు 45 వరకు తీరగ్రామాలుండగా ఈగ్రామాల్లో నిన్నటి నుంచి బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. తీరానికి అత్యంత సమీపంగా ఉన్న గ్రామాల్లోని తుపాను షెల్టర్లులో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు అక్కడ జనరేటర్లు, భోజన సదుపాయం, తాగునీరు సిద్ధం చేశారు.
ఉప్పాడ తీరంలో ఎగిసిపడుతున్న అలలు..
తుపాను వచ్చిందంటే చాలు ఉప్పాడ తీరం చివురుటాకులా వణికిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.. తుపాను ప్రభావంతో రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండడంతో కాకినాడాఉప్పాడ బీచ్ రోడ్డును పోలీసులు మూసివేశారు. .పర్యాటకులు, సందర్శకులు ఎవ్వరూ బీచ్‌లోకి రావద్దని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. అయితే కాకినాడ నుంచి యు.కొత్తపల్లి మండలంలో ఉప్పాడ తదితర ప్రాంతాల్లోని తీరప్రాంతం భారీగా కోతకు గురవుతోంది.
కోనసీమ, కాకినాడ జిల్లాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు..
తుపాను తీవ్ర పెను తుపానుగా మారడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ప్రత్యేకాధికారులుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది. ఈనేపథ్యంలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు జయలక్ష్మి అనే సీనియర్ అధికారిని నియమించింది ప్రభుత్వం. అమలాపురం డివిజన్ 9440812659, కాకినాడ డివిజన్ 9493178718, రామచంద్రపురం డివిజన్ 9493178821, రాజమహేంద్రవరం సర్కిల్ 7382299960, టౌన్ డివిజన్` 9490610094, రాజమహేంద్రవరం రూరల్ 9490610003, పెద్దాపురం డివిజన్` 9059034479, జగ్గంపేట డివిజన్ 9490610096.