Minister Vidadala Rajini : చింతమనేని సంస్కారం లేని వ్యక్తి, నోరు అదుపులో పెట్టుకో- మంత్రి విడదల రజని
Minister Vidadala Rajini : చింతమనేని ప్రభాకరరావు సంస్కారం లేని వ్యక్తి అని మంత్రి విడదల రజని విమర్శించారు. మహిళల పట్ల చింతమనేని ఎలా ప్రవర్తిస్తారో వనజాక్షి ఘటనతోనే స్పష్టం అవుతోందన్నారు.
Minister Vidadala Rajini : జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగానికి స్వర్ణయుగమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని అన్నారు. రాజమండ్రి మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఆమె పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నిర్మిస్తుండగా అత్యంత ప్రయారిటీగా అయిదు మెడికల్ కాలేజీలను నెల రోజుల వ్యవధిలో ప్రారంభం కానున్నాయని మంత్రి విడదల రజని తెలిపారు. మే నెలాఖరుకల్లా 150 ఎంబీబీఎస్ సీట్లు అడ్మిషన్లుతో రాజమండ్రి మెడికల్ కాలేజీ అకడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుందన్నారు. విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల ప్రాంతాల్లో ఎన్‌ఎఫ్‌సీ ఇన్‌స్పెక్షన్ అయ్యిందని, లెటర్ ఆఫ్ పర్మీషన్(ఎల్‌ఓపీ) కూడా వచ్చిందని తెలిపారు. మరికొన్ని ప్రాసెస్‌లో ఉన్నాయన్నారు. త్వరలోనే పర్మిషన్లు అన్నీ సానుకూలంగా వస్తాయని చెప్పారు. అన్నీ పూర్తిచేసుకుని ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి రజని తెలిపారు. జగనన్న పాలనలో వైద్య ఆరోగ్య రంగం ఒక స్వర్ణయుగమే అన్నారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యసేవలను అందించడం, మెరుగైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నామన్నారు.
మంచి ఆలోచనలతో, ముందు చూపుతో
చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీను తీసుకొచ్చిన పాపాన పోలేదని మంత్రి విడదల రజని విమర్శించారు. రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలందించేందుకు ఎంత ఖర్చు అయినా ముఖ్యమంత్రి వెనుకాడడం లేదన్నారు. చంద్రబాబు టెంపరరీ ఆలోచనలు చేస్తారని, అదే జగనన్న పర్మినెంట్ విధానంలో ఆలోచనలతో ముందుకు వెళతారని, భావితరాలకు ఉపయోగపడేలా చేస్తారన్నారు. ఇవేమీ పట్టని చంద్రబాబు వైద్య ఆరోగ్యం గురించి ఏదిబడితే అది మాట్లాడుతున్నారని, టీడీపీ నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో చెప్పుకోవడానికి ఏమీ లేదని, చెప్పుకోదగ్గవి లేవని, జగనన్న ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై బురద చల్లడమే టీడీపీ పని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మంచి ఆలోచనలతో, లక్ష్యంతో, ముందు చూపుతో ముందుకు సాగుతున్నారన్నారు.
దమ్ముంటే, ధైర్యముంటే ఏం చేశారో చెప్పాలి..
టీడీపీ నేతలకు దమ్ముంటే, ధైర్యముంటే వారి ప్రభుత్వంలో ఏం చేశారో చెప్పాలని మంత్రి విడదల రజని సవాల్ విసిరారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు గురించి మాట్లాడుతూ... మహిళల పట్ల ఆయనకు ఎటువంటి సంస్కారం ఉందో వనజాక్షి విషయం స్పష్టమైందన్నారు. అటువంటి వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. చింతమనేని నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. మంత్రి విడదల రజని మేకప్ వేసుకొని తిరుగుతున్నారా అంటూ చింతమనేని విమర్శించారు. చింతమనేని వ్యాఖ్యలకు మంత్రి రజని ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు.
ఆరోగ్యశ్రీకు మొదటి ప్రయారిటీ
ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లుల గురించి తమ నోటీస్‌లోఉందని, బడ్జెట్ త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి విడదల రజని అన్నారు. వైఎస్ఆర్ బాటలో జగనన్న ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఎంత మేలు చేసే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. త్వరలోనే అన్ని బిల్లులు క్లియర్ చేస్తామన్నారు. కోవిడ్ మాత్రమే కాదు ఎటువంటి వేరియంట్ వచ్చినా మేము సన్నద్ధంగానే ఉన్నామని తెలిపారు. ఫ్యామిలీ డాక్టర్ ట్రయల్‌రన్ ఆరు నెలలు నిర్వహించామన్నారు. అన్ని సక్రమంగా జరుగుతాయని తెలిపారు.