Rains: వాతావరణ శాఖ అలర్ట్ - ఏపీలో మళ్లీ వర్షాలు, తెలంగాణలో ఈ జిల్లాలకు వర్ష సూచన
Weather Report: ఈ నెల 5న మరో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అటు, తెలంగాణలోనూ రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది.
Latest Weather Report In AP And Telangana: ఇప్పటికే భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వర్షాల ధాటికి నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరదలతో విజయవాడ (Vijayawada) నగరంలో జనజీవనం స్తంభించింది. అధికారులు వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అటు, ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 5 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకుని ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా మచిలీపట్నం వరకూ రుతుపవన ద్రోణి ఆవరించి ఉండనున్నట్లు అంచనా వేశారు.
కాగా, బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం బలహీనపడుతోంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాలో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అటు, పార్వతీపురం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది.
District forecast of Andhra Pradesh dated 02-09-2024#IMD #APWeather #APforecast #MCAmaravati #CEOAndhra #AndhraPradeshCM #dgpapofficial #IMDWeather pic.twitter.com/pH5yyUVUbj
— MC Amaravati (@AmaravatiMc) September 2, 2024
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు
అటు, భారీ వర్షాలు, వరద తీవ్రత దృష్ట్యా గుంటూరు జిల్లాలో మంగళవారం కూడా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు కలెక్టర్ నాగలక్ష్మి సెలవు ప్రకటించారు. మంగళవారం కూడా వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు కచ్చితంగా సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు, వర్షాలు తగ్గని క్రమంలో మరికొన్ని జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోనూ..
మరోవైపు, తెలంగాణలోనూ (Telangana) మరో 4 రోజులు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే, ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 - 50 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా, గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సిద్ధిపేట, మెదక్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 25.4, సదాశివనగర్‌లో 24, నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో 22.1 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.