Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు - మరమ్మతులకు ప్రభుత్వం చర్యలు, రంగంలోకి నిపుణులు కన్నయ్య నాయుడు
Vijayawada News: ప్రకాశం బ్యారేజీలో వరద ఉద్ధృతికి 4 బోట్లు కొట్టుకువచ్చిన గేట్లను ఢీకొన్నాయి. ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతినగా.. ప్రభుత్వం డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్యనాయుడిని రంగంలోకి దించింది.
Damage In Prakasam Barrage Gates Due To Boats: విజయవాడ ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా వరద పోటెత్తడంతో సమీప ప్రాంతాల ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా.. బ్యారేజీ నుంచి 11.40 లక్షల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు.. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు. అధికారులు మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద 24.4 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది. కాగా, వందేళ్లలో ఇది రెండో అతిపెద్ద వరద ప్రవాహంగా తెలుస్తోంది. 2009 అక్టోబర్ 5న 10,94,422 క్యూసెక్కుల వరద వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడే కృష్ణమ్మకు వరద పోటెత్తినట్లు పేర్కొంటున్నారు.
బ్యారేజీ గేట్లను ఢీకొన్న బోట్లు
అటు, కృష్ణమ్మ వరద ఉద్ధృతికి 4 బోట్లు కొట్టుకొచ్చి బ్యారేజీ గేట్లను ఢీకొన్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చిన బోట్లు బ్యారేజీ 3, 4 గేట్లను ఢీకొన్నాయి. గేట్ల నుంచి విడుదలవుతోన్న నీటికి ఇవి అడ్డంకిగా మారడంతో నీరు నిలిచిపోయింది. దాదాపు 40 కి.మీ వేగంతో వచ్చి బోట్లు ఢీకొనగా బ్యారేజీలోని ఓ పిల్లర్ పాక్షికంగా దెబ్బతింది. ఇరుక్కున్న 4 బోట్లలో ఒకటి కొట్టుకుపోయింది. అయితే, 69వ నెంబర్ గేట్ వద్ద కౌంటర్ వెయిట్ ధ్వంసం చేసిన బోటు అలానే ఉండగా.. ఇది తీసేందుకు నిపుణులు రావాలని బ్యారేజీ డ్యాం సేఫ్టీ ఇంజినీర్ రత్నకుమార్ తెలిపారు. 'గతంలో ఎన్నడూ చూడనంత వరద ప్రకాశం బ్యారేజీకి వస్తోంది. కొట్టుకు వచ్చిన బోట్ల తాకిడికి బ్యారేజీలోని 69వ గేట్ వద్ద కౌంటర్ నిర్మాణం విరిగిపోయింది. దీని వల్ల ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకపోయినా భవిష్యత్ దృష్ట్యా కొత్త కౌంటర్ వెయిట్ ఏర్పాటు చెయ్యాలి. ప్రకాశం బ్యారేజీలో ఎన్నడూ లేనంతగా లేనంత వాటర్ ఇన్ ఫ్లో వెళ్తోంది. బోట్ల తాకిడితో ప్రస్తుతం వాటర్ ఇన్ ఫ్లోకి ఇబ్బంది లేకపోయినా.. మళ్లీ వరద వస్తే సమస్య అవుతుంది. మరో 3 రోజుల్లో హైబ్రిడ్ కౌంటర్ వెయిట్ ఏర్పాటు చేస్తాం. ప్రవాహం తగ్గగానే బోట్లను తొలగిస్తాం' అని పేర్కొన్నారు.
రంగంలోకి కన్నయ్య నాయుడు
ప్రకాశం బ్యారేజీలో దెబ్బతిన్న గేట్ వద్ద కౌంటర్ వెయిట్ నిర్మాణానికి జల వనరుల నిపుణుడు కన్నయ్య నాయుడును ప్రభుత్వం రంగంలోకి దించింది. ఆయన సోమవారం సాయంత్రానికి బ్యారేజీ వద్దకు చేరుకుని పనులు పర్యవేక్షిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతారని చెప్పారు. కాగా, ఇటీవలే తుంగభద్ర జలాశయం ప్రవాహంలో 19వ గేట్ కొట్టుకుపోగా.. నీటి వృథాను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు డ్యాం గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడిని పిలిపించారు. ఆయన కేవలం 4 రోజుల్లోనే స్టాప్ లాగ్ గేట్ విజయవంతంగా అమర్చి దేశంలోనే తొలిసారిగా ఇంజినీరింగ్ అద్భుతాన్ని సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను ఏపీ ప్రభుత్వం జల వనరుల మెకానికల్ విభాగం సలహాదారులుగా నియమిస్తూ గౌరవించింది. ఇరిగేషన్ ప్రాజెక్టుల హైడ్రాలిక్ గేట్లు, హ్యాండ్లింగ్ ఎక్విప్‌మెంట్ విషయాల్లో ఆయన సలహాదారుగా కొనసాగుతున్నారు.