AP Telangana BJP Presidents: బీజేపీ అధ్యక్షులు ఎవరో తేలేది నేడే.. తెలంగాణలో కొనసాగుతోన్న ఉత్కంఠ
Telangana BJP President | ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులు ఎవరో మరికొన్ని గంటల్లో స్పష్టత రానుంది. నేడు నేతలు నామినేషన్ వేయనున్నారు.

అమరావతి/ హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుల ఎన్నిక కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాలకు బీజేపీ అధ్యక్షుల పేర్లు వెల్లడి కానున్నాయి. నేడు రెండు రాష్ట్రాల్లో అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరణ, ఉప సంహరణ ప్రక్రియ నిర్వహిస్తారు.
ఏపీలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ కౌన్సిల్ మెంబర్స్ కోసం నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. జులై 1వ తేదీన ఉదయం 11 గంటలకు ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎవరన్నది ప్రకటించనున్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడి పేరు ఖరారు..!
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు సమాచారం. నేడు లాంఛనంగా నామినేషన్ వేయనున్నారు మాధవ్. బీజేపీ హైకమాండ్ మాధవ్ కు ఏపీ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. మరికొన్ని గంటల్లో దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. అధిష్టానం ఆదేశానుసారం ఒక్కరే నామినేషన్ వేసే అవకాశాలు ఉన్నాయి.
తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికో..
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక దాదాపు క్లెమాక్స్‌కు చేరింది. రాష్ట్ర అధ్యక్షులతో పాటు జాతీయ కౌన్సిల్ సభ్యుల ఎన్నికకు బీజేపీ తెలంగాణ ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ ఆదివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సోమవారం (జూన్ 30న) మధ్యాహ్నం 2 గంట నుంచి సాయంత్రం 4 గంటల వరకు నేతల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, ఎంపీ ఈటల రాజేందర్ లలో ఒకరికి తెలంగాణలో పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్లు సైతం వినిపించాయి. పార్టీ అధిష్టానం మాత్రం ఈటల, రామచందర్ రావులలో ఒకరికి పార్టీ పగ్గాలు దక్కుతాయని సమాచారం. బీసీ సమాజికవర్గానికి బాధ్యతలు అప్పగించాలని అధిష్టానం భావిస్తే కనుక ఈటల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అవుతారు.
కాబోయే అధ్యక్షుడికి నేటి ఉదయం ఫోన్ కాల్ ద్వారా సమాచారం అందుతుంది. ఆ నేత రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం నామినేషన్ దాఖలు చేస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే నిన్న రాత్రి హైదరాబాద్ కు వచ్చారు. జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ నేడు నగరానికి రానున్నారు. జులై 1న ఉదయం మన్నెగూడలోని ఫంక్షన్ హాలులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పేరును అధికారికంగా ప్రకటించనున్నారు.






















