Purandareswari Latest comments about janasena and bjp alliance: జనసేన- బీజేపీ పొత్తుపై పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తుల అంశంపైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది.
ఏపీలో టీడీపీ జనసేన పొత్తులో ఉన్నాయి, వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తానంటోంది. అంతవరకు అందరికీ క్లారిటీ ఉంది. వామపక్షాలు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉండగా, ఏపీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయో చూడాలి. ఇక బీజేపీ. బీజేపీ ప్రస్తుతానికి ఒంటరి పార్టీ. జనసేనతో పొత్తులో ఉన్నది అనుకోడానికి లేదు, అలాగని ఆ రెండు పార్టీలు వైరి వర్గాలు అని కూడా చెప్పలేం. తెలంగాణలో బీజేపీ-జనసేన కూటమి కలసి పోటీ చేసింది కూడా, లోక్ సభ ఎన్నికల్లో మాత్రం జనసేనతో పొత్తు ఉండదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆల్రడీ క్లారిటీ ఇచ్చారు. ఈ దశలో ఏపీ పొత్తుపై కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ పొత్తుపై ఆమె ఏమన్నారు..?
ఏపీలో పొత్తులపై పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు
ఈరోజు జరిగిన రాష్ట్ర మోర్చాల సంయుక్త సమావేశంలో పాల్గొన్న అనంతరం ఏపీలో పొత్తులపై పురందరేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జనసేన టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఆ పార్టీతో తమ పొత్తు మాత్రం ఇంకా కొనసాగుతోందని చెప్పారామె. జనసేనతో తమ పార్టీ పొత్తు కొనసాగుతోందని చెప్పారు పురందరేశ్వరి. ఈ అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలో పొత్తుల విషయంపై జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వబోతున్నట్టు చెప్పారు. ఎన్నికలకు నెల రోజుల ముందు పొత్తులపై బీజేపీ అధి నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతానికి జనసేనతో పొత్తులోనే ఉన్నామని క్లారిటీ ఇచ్చారు పురందరేశ్వరి. అయితే సార్వత్రిక ఎన్నికల్లో పొత్తుల విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమన్నారు పురందరేశ్వరి.
ఇటీవల జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పొత్తుల అంశంపైనే వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఇటు టీడీపీ, అటు జనసేన అభ్యర్థులను ఖరారు చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ దశలో బీజేపీ వ్యవహారం కూడా తేలితే అభ్యర్థుల విషయంలో అందరికీ ఓ క్లారిటీ వస్తుంది. అందుకే జనసేన, టీడీపీ తరపున రాయబారం నడిపేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
టీడీపీ డైలమా..?
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ప్రస్తుతానికి ఖాయంగా ఉంది. బీజేపీ విషయంలోనే ఆ పార్టీ డైలమాలో ఉంది. బీజేపీతో కలిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం కూడా ఉందనేది చంద్రబాబు భయం. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, ఏపీలో ఆ పార్టీకి ఓట్లు పెద్దగా లేవు. పైగా సీట్ల విషయంలో టీడీపీ త్యాగాలు చేయాల్సి వస్తుంది. అందుకే టీడీపీ తొందరపడటం లేదు. మరోవైపు షర్మిల ఎంట్రీతో ఏపీలో కాంగ్రెస్ కూడా పుంజుకునే అవకాశాలున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ పార్టీ గెలుస్తుందని చెప్పలేం కానీ.. టీడీపీ, వైసీపీ అసంతృప్తులకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనపడుతోంది.
వేచి చూస్తున్న బీజేపీ..
పొత్తుల విషయంలో బీజేపీ మాత్రం వేచి చూసే ధోరణిలో ఉంది. తమకు తామే టీడీపీ నేతలు తమ వద్దకు రావాలని వారు ఆలోచిస్తున్నారు. అదే సమయంలో జనసేనతో మాత్రం తమ స్నేహం కొనసాగాలనుకుంటున్నారు. పురందరేశ్వరి వ్యాఖ్యల్లో ఎక్కడా టీడీపీపై వ్యతిరేకత కనపడటంలేదు, అదే సమయంలో పొత్తుల వ్యవహారం అంతా అధిష్టానం చేతుల్లోనే ఉందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలనాటికి బీజేపీ ఏవైపు ఉంటుందో చూడాలి. ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఏపీలో పోరు మరింత రసవత్తరంగా ఉంటుంది.