KA Paul: విశాఖలో కేఏ పాల్ హల్‌చల్, సీఐ కాలర్ పట్టుకుని చిందులు
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు.
KA Paul: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దీక్షను మంగళవారం పోలీసులు భగ్నం చేశారు. శిబిరం నుంచి ఆయన్ను బలవంతంగా పరీక్షలు నిమిత్తం విశాఖ KGH కు తరలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు పేరుతో కేఏ పాల్ సోమవారం ఆమరణ నిరాహార దీక్ష మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.
పోలీసులు మంగళవారం కేఏ పాల్ దీక్షను భగ్నం చేశారు. ఈ క్రమంలో కేఏ పాల్‌కు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సమయంలో కేజీహెచ్ గేట్ వద్ద పోలీసులతో కేఏ పాల్ వాగ్వాదానికి దిగారు. వారితో దురుసుగా ప్రవర్తించిన ఆయన.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తనకు వైద్యం అవసరం లేదని కేకలు వేశారు. తనను వదిలి పెట్టాలని ఆయన కేకలు వేశారు. ఆయనను అడ్డుకోబోయిన సీఐ రామారావు కాలర్ పట్టుకుని దురుసుగా ప్రవర్తించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసులపై ఆరోపణలు చేశారు. పోలీసులు తన చేతులు, కాళ్లు విరగగొట్టారని, దీక్ష 24 గంటలు గడవకముందే భగ్నం చేశారని ఆరోపించారు.
ఏపీలో రాక్షస పాలన సాగుతోందని, తక్షణమే సిఐ రామారావును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నా చావు కోసం ఈ రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ నష్టాల్లో లేదని,. నష్టాలు వచ్చేటట్లు చేస్తున్నారని పాల్ అన్నారు. టీడీపీ, వైసీపీ, బీజేపీ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలు చేయాలని సవాల్ విసిరారు. పోలీసులు ఆయనకు సర్దిచెప్పినప్పటికీ ఆయన శాంతించలేదు. దీంతో ఆయన్ను అరెస్ట్ చేసి విశాఖ కేజీహెచ్ తరలించారు. పోలీసుల కళ్లు గప్పి కేజీహెచ్ నుంచి తప్పించుకుని తన వాహనంలో మళ్లీ కేఏ పాల్ దీక్షా శిబిరానికి చేరుకున్నారు.
కాపులు 27 శాతం ఉన్నాం, సీఎం అవుతాం..
అనంతరం ఆయన అధికార, ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ గురిచి మాట్లాడనని పవన్ కల్యాణ్ చెప్పారని, కానీ విశాఖ ప్లాంట్‌ను అమ్మడానికి యత్నిస్తున్న బీజేపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ప్రజా శాంతి పార్టీలో చేరాలని కోరారు. పవన్ సైతం మోదీ, చంద్రబాబు, లోకేష్ జెండా మోయకుండా ప్రజాశాంతి పార్టీ జెండా మోయాలని సూచించారు. కాపులు 27 శాతం ఉన్నారని, పవన్‌ను సీఎం చేస్తామని అన్నారు. ప్రజారాజ్యం పేరుతో అన్న చిరంజీవి పార్టీ పెడితే పవన్ యువరాజ్యం బాధ్యతలు చూశారని, 2011లో పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారని విమర్శించారు.
పవన్ కల్యాణ్ తనతో చేతులు కలపాలని, ఈ అడుక్కునే బతుకు మనకు అవసరమా అని ప్రశ్నించారు. అందరితో ప్యాకేజీ స్టార్ అనే మచ్చను చెరిపేసుకోవాలన్నారు. బీజేపీని గెలిపించమని అడిగితే 100 జన్మలు ఎత్తినా ప్రజలు ఓటు వేయరని అన్నారు. 2019లో జనసేన, సీపీఎం, సీపీఐ, బీఎస్సీ కలిసి పోటీ చేస్తేనే 6 శాతం ఓట్లు రాలేదన్నారు. తాను బీసీ అని రాష్ట్రంలో 60 శాతం బీసీలు ఉన్నారని, ఒక్క బీసీనైనా సీఎం చేశారా అని వైసీపీ, టీడీపీని ప్రశ్నించారు. బీసీని ముఖ్యమంత్రిని చేసుకుందామని, వారిని అభివృద్ధి చేసుకుందామన్నారు. జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని, పవన్ కల్యాణ్‌ను ఇంటర్నేషనల్ యాక్టర్ చేస్తానన్నారు.
హాలీవుడ్‌లో తనకు చాలా మంది మిత్రులు ఉన్నారని, పవన్ సినిమా హీరోగా పని చేసుకుంటే, తాను రాజకీయాల్లో రియల్ హీరోగా ఉంటూ వారి తాట తీస్తానన్నారు. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేస్తే తిరిగి లాగేసుకుంటామని, తాను ఉండగా ప్లాంట్‌ను ఎవరు కొంటారని ప్రశ్నించారు. తన ప్రాణం పోయినా పర్వాలేదని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.