Pition On Offline G.Os : జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టాలని ఆదేశించండి.. ఏపీ హైకోర్టులో పిటిషన్..!
జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకూడదన్న ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. సమాచార హక్కు చట్టం ప్రకారం జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టకూడదన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం చట్ట విరుద్ధమైనది ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. చెవుల కృష్ణాంజనేయులు అనే జర్నలిస్టు ఈ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శి ఆగస్టు 15న ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను పిటిషన్‌లో సవాల్ చేశారు. సమాచారహక్కు చట్టంలో పేర్కొన్న అంశాలకు అనుగుణంగా 2008 నుంచి పూర్తి స్థాయిలో పారదర్శకంగా జీవోలను ఆన్‌లైన్లో ఉంచుతున్నారని కానీ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం రహస్యంగా ఉంచాలని నిర్ణయిం తీసుకుందన్నారు. సమాచార హక్కు చట్టం సెక్షన్ 4(1)(బి) ప్రకారం భద్రత, నిఘా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు తప్ప ఇతర ఏ జీవోలైనా పబ్లిక్ డాక్యుమెంట్లేనని వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచాలని పిటిషనర్ హైకోర్టుకు తెలిపారు. జీవోలను రహస్యంగా ఉంచేందుకు అధికారులకు అనుమతిస్తే.. పరిపాలన వ్యవహారమంతా చీకటిమయం అవుతుందని అందుకే జీవోలన్నింటినీ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసేలా ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
మాన్యువల్ పద్దతిలో రిజిస్టర్లు పెట్టుకుని జీవోలివ్వాలని ఆన్‌లైన్‌లో వద్దని ప్రభుత్వం అన్ని శాఖలకు స్పష్టం చేసింది. ఆ మేరకు జీవోఐఆర్ వెబ్‌సైట్‌లో అప్ లోడ్స్ నిలిచిపోయాయి. ఏపీ ప్రభుత్వం జీవోలను రహస్యంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రభుత్వ జీవోలను జారీ చేసిన 24 గంటల్లో అందుబాటులో ఉంచాలని తెలంగాణ హైకోర్టు అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశిచింది. జీవోలను ప్రభుత్వాలు రహస్యంగా ఉంచవద్దని కేంద్రం కూడా పలుమార్లు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అయినా ప్రభుత్వం జీవోలను బయటకు రాకుండా చేయాలనే నిర్ణయం తీసుకుంటుంది. కోర్టులో ఎదురు దెబ్బ తగలడం ఖాయమని అయినా ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారని పలువురు విపక్ష నేతలు, జర్నలిస్టులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అయితే ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నట్లుగా జీవోలను సీక్రెట్‌గానే ఉంచుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అనేక జీవోలు వివాదాస్పదమయ్యాయి. ప్రభుత్వ నిర్ణయాలు చట్ట విరుద్ధమంటూ అనేక మంది కోర్టుల్లో పిటిషన్లు కూడా వేశారు. అనేక జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం కాన్ఫిడెన్షియల్ జీవోలతో పాటు బ్లాంక్ జీవోల విధానాన్నీ తీసుకు వచ్చింది. దానిపైనా విమర్శలు వెల్లువెత్తాయి. విపక్షాలు గవర్నర్‌కు ఫిర్యాదు చేశాయి. చివరికి అసలు జీవోలనే సీక్రెట్‌గా ఉంచాలని నిర్ణయించారు. హైకోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉంది. ఇతర హైకోర్టుల తీర్పులు.. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సమాచార హక్కు చట్టంలో పేర్కొన్న అంశాలను చూస్తే ఈ విషయంలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు