Janasena Donations : చెక్కులిచ్చి టిక్కెట్లు డిమాండ్ - ఆ నేతలకు షాకిచ్చిన పవన్ కల్యాణ్
Pawan Kalyan : చెక్కుల రూపంలో ఇచ్చిన విరాళాలను పవన్ కల్యాణ్ తిరస్కరిస్తున్నారు. అలా విరాళాలు ఇచ్చిన వారిలో ఎక్కవ మంది టిక్కెట్లు అడుగుతూండటమే కారణం.
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీకి విరాళాలు ఇచ్చి అదే అర్హతగా సీట్లు అడుగుతున్నారు. కొంతమంది ప్రముఖులు జనసేనకు విరాళం ఇస్తున్నామని చెప్పి చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత వారు తమ మనసులో మాటను బయటపెట్టారు. చెక్కులు ఇచ్చిన తర్వాత పలానా సీటు కావాలని డిమాండ్ చేశారు. దీంతో జనసేనాని పవన్ కల్యాణ్ కు కోపం వచ్చింది. అడగకపోయినా జనసేనకు విరాళం పేరుతో చెక్కులు ఇచ్చి, ఇప్పుడు సీట్లు అడగటం ఏంటని.. ఆశావహులపై సీరియస్ అయ్యారు పవన్ కల్యాణ్. అసెంబ్లీ, లోక్ సభ సీట్లు అడిగిన వారి చెక్‌లు వెనక్కి పంపాలని తన పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు .
పవన్ ఆదేశాలతో 7 చెక్కులను వెనక్కిపంపేశారు జనసేన నాయకులు. పార్టీకి విరాళం పేరుతో వారు ఇచ్చిన డబ్బుల చెక్ ను తిరిగి వారికే పంపేశారు. ఊహించని ఈ పరిణామంతో ఆశావహులు కంగుతిన్నారు. పవన్ నిర్ణయం వారిని షాక్ గురి చేసింది. రాయలసీమతో పాటు గోదావరి జిల్లాల్లోని కొందరు నాయకులకు తిరిగి చెక్కులు అప్పగించేశారు. పార్టీలో కష్టపడినవారికే టికెట్లు ఇవ్వాలని పవన్ నిర్ణయించుకున్నారు. టికెట్ల కోసం ఆశపడి ఇచ్చే విరాళాలు తీసుకోవద్దని పార్టీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. స్వచ్చందంగా ఇచ్చే విరాళాలు మాత్రమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై చెక్కులు తీసుకోకూడదని.. కేవలం స్కాన్ ద్వారానే విరాళం తీసుకోవాలని నిర్ణయించారు.
తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండటంతో జనసేన పార్టీ కి లభించే సీట్లలో మంచి విజయావకాశాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ప్రముఖులు జనసేన టికెట్ ఆశిస్తున్నారు. జనసేన తరపున అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. జనసేన నుంచి అసెంబ్లీ, లోక్ సభ టికెట్లు ఆశిస్తున్నారు. ఈ క్రమంలో వారు నేరుగా టికెట్ అడక్కుండా.. ముందుగా పార్టీకి విరాళం ఇచ్చినట్లుగా చెక్కులు ఇస్తున్నారు. ఆ తర్వాత పలానా టికెట్ కావాలని పవన్ కల్యాణ్ ముందు ప్రపోజల్ పెడుతున్నారు. వారి ప్లాన్ బెడిసికొట్టింది. ఇది వర్కవుట్ కాలేదు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై ఇంకా చర్చలు జరుగుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు చేస్తున్నారు. జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తారు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? అభ్యర్థులు ఎవరు? అనేదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. జనసేనకు బలమైన అభ్యర్థులు ఉన్నా లేకపోయినా.. ఉన్న నేతలనే నియమిస్తారని చెబుతున్నారు.