(Source: ECI/ABP News/ABP Majha)
Leopard In Tirumala: శ్రీవారి మెట్టుమార్గంలో చిరుత సంచారం, భక్తులకు టీటీడీ హెచ్చరిక
Leopard In Srivari Mettu: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు, స్థానికంగా ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు.
Tirumal News: శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. వేగంగా రోడ్డు దాటుతూ భక్తులకు కనిపించింది. దీంతో భయాందోళనకు గురైన భక్తులు, స్థానికంగా ఉన్న టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు వాటర్ హౌస్ దగ్గర భక్తులను నిలిపి వేశారు. బస్సులను, కార్లను మాత్రమే శ్రీవారిమెట్టు వద్దకు అనుమతిస్తున్నారు.
కాలి నడకన వెళ్లే భక్తులను గుంపులు, గుంపులుగా తిరుమలకు అనుమతిస్తున్నారు. చిరుత సంచారం నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది ఘటన స్ధలం వద్దకు చేరుకుని చిరుత సంచరించిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చుతున్నారు. మరోవైపు చిరుత సంచారం నేపధ్యంలో అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గంలో ఆంక్షలను టీటీడీ కొనసాగిస్తోంది.
గత కొద్దికాలంగా తిరుమల నడకమార్గాల్లో చిరుత, ఎలుగుబంట్లు, ఇతర వన్యప్రాణుల సంచారం విపరీతంగా పెరిగింది. ఇద్దరు చిన్నారులపై చిరుతలు దాడి చేశాయి. అందులో లక్షిత అనే చిన్నారి మృతి చెందింది. అప్పటి నుంచి టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. టీటీడీ, అటవీ శాఖ సంయుక్తంగా ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ క్రమంలో చిరుతలను బోన్లలో బంధించారు. అయినా చిరుతల సంచారం తగ్గలేదు.
గత నెలలో నరసింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచరించినట్టు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మూడు రోజులు పాటు రాత్రి సమయంలో చిరుత, ఎలుగుబంటి తిరుగుతున్నట్లు గుర్తించారు. అంతే కాదు గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచరించినట్టు తేల్చారు. వాటి కదలికను గుర్తించేందుకు నడక మార్గంలో టీటీడీ ట్రాప్ కెమెరాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు.
శ్రీవారి మెట్టు మార్గంలో సెప్టెంబర్ ఆరో తేదీ చిరుత సంచారాన్ని గుర్తించారు. దీంతో తిరుమల కాలినడక దారి భక్తులను టీటీడీ అలెర్ట్ చేసింది. చిరుతను బంధించేందుకు ఏర్పాటు చేశారు. చిరుత బోనులో చిక్కుకునే ప్రాంతాలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. సెప్టెంబర్ ఒకటోతేదీ అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయం నామాల గవి వద్ద చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అమర్చిన ట్రాప్ కెమెరాలో చిరుత సంచరించినట్లు రికార్డు అయింది. టీటీడీ అధికారులు చిరుతల కదలికలను గుర్తించి ఆ ప్రాంతంలో బోనులు ఏర్పాటు చేసి బంధిస్తూ వస్తున్నారు. అయితే నడకదారిలో వన్యమృగాలు సంచరించడంతో నడక మార్గాల్లో తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య తగ్గింది.
భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టింది. తిరుమల నడక మార్గాల్లో మొత్తం ఐదు చిరుతలను అటవీ అధికారులు బోనులు ఏర్పాటు చేసి పట్టుకున్నారు. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో, సెప్టెంబర్ 6వ తేదీన చిరుతలు బోనులో పడ్డాయి. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని, భక్తుల భద్రత విషయంలో రాజీపడబోమని టీటీడీ చైర్మన్ కరుణాకరరెడ్డి, ఈఓ ధర్మారెడ్డి చెప్పారు.