Nellore Mayor Politics: వైసీపీకి రాజీనామా చేసినా నెల్లూరు మేయర్ పీఠం గల్లంతే - అవిశ్వాసం పెట్టిన టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
Nellore Mayor: నెల్లూరు మేయర్ పై టీడీపీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేసినా..పదవీ గండం ఏర్పడింది.

No-confidence motion against Nellore Mayor: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ నేతృత్వంలో 40 మంది కార్పొరేటర్లు కలెక్టర్‌కు నోటీసు ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 91/ఎ సెక్షన్ ప్రకారం, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్‌తో పాటు మరొక డిప్యూటీ మేయర్ సయద్ తహ్సీన్‌తో కలిసి 40 మంది కార్పొరేటర్లు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ నోటీసును సమర్పించారు. స్రవంతిని తొలగించి, కొత్త మేయర్‌ను ఎన్నుకోవాలని కోరారు.
గతంలోనే వైసీపీకి రాజీనామా చేసిన మేయర్ స్రవంతి
మేయర్ స్రవంతి పాలనలో జరిగిన అక్రమాలకు పాల్పడుతున్నారని కార్పొరేటర్లు ఆరోపించారు. గత నాలుగేళ్లలో కార్పొరేషన్ సమావేశాలు కేవలం ఏడు సార్లు మాత్రమే ఏర్పాటు చేశారని, ఇది ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీయడమేనన్నారు. మేయర్ స్రవంతి ప్రజలు, కార్పొరేటర్ల విశ్వాసాన్ని ఎప్పటికే కోల్పోయారని, ఆమె భర్త జయవర్ధన్ కమిషనర్‌ల సంతకాలను ఫోర్జరీ చేసి నేరాలకు పాల్పడ్డారన్నారు. ఫోర్జరీ కేసులో ఇప్పటికే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, ఇది నగర కార్పొరేషన్ ప్రతిష్టను దెబ్బతీసిందని కార్పొరేటర్లు అన్నారు. 2024 జూలైలో జరిగిన ఫోర్జరీ కేసులో, మేయర్ భర్త జయవర్ధన్‌తో పాటు ఐదుగురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, నలుగురు ఎన్‌ఎంసీ ఉద్యోగులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్ వికాస్ , మాజీ కమిషనర్ హరితల సంతకాలను ఫోర్జరీ చేసి, 70 ఆస్తుల డీడ్లను మోర్ట్‌గేజ్ నుంచి విడుదల చేసి, కార్పొరేషన్‌కు నష్టం కలిగించారని వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ఇటీవల కాకాణి గోవర్ధన్ రెడ్డితో సమావేశం కావడంతో అవిశ్వాసస తీర్మానం
ఈ అవిశ్వాస తీర్మానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. 2024 మార్చిలో ఎంపీ వెమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు టీడీపీలో చేరిన యాదవ్, ఎన్‌ఎంసీలో టీడీపీ ప్రధాన వర్గానికి నేతగా వ్యవహరిస్తున్నారు. 54 సభ్యుల నెల్లూరు కార్పొరేషన్‌లో టీడీపీకి 41 మంది కార్పొరేటర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన మెజార్టీ సరిపోతుంది. అవిశ్వాస తీర్మానానికి మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా మద్దతు ప్రకటించారు. శ్రీధర్ రెడ్డి కార్యాలయంలో డిప్యూటీ మేయర్లు, సీనియర్ కార్పొరేటర్లతో జరిగిన సమావేశంలో అవిశ్వాసంపై నిర్ణంయ తీసుకున్నారు.
రూప్ కుమార్ యాదవ్ నేతృత్వంలో అవిశ్వాస తీర్మానం
నెల్లూరు వైసీపీకి ఈ అవిశ్వాస తీర్మానం మరో షాక్‌గా మారింది. 2024 జూన్‌లోనే మేయర్ స్రవంతి వైసీపీకి రాజీనామా చేశారు. అయితే ఆమె కూటమి పార్టీలు ఆహ్వానించలేదు. కానీ ఇటీవల స్రవంతి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డితో భేటీ అవడంతో ఆమెను పదవి నుంచి తప్పించాలని నిర్ణయించారు. అవిశ్వాస తీర్మానం ప్రకారం, కలెక్టర్ 15 రోజుల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఓటింగ్ జరపాలి. 54 సభ్యుల సభలో మెజారిటీ 28 ఓట్లు వస్తే మేయర్ స్థానం పోతుంది.





















