Raithanna Meekosam: అన్నదాతలకు అండగా ప్రభుత్వం.. ఏపీలో నేటి నుంచి రైతన్నా మీకోసం కార్యక్రమాలు
Andhra Pradesh News | ఏపీ సీఎం చంద్రబాబు నిర్ణయంతో నేటి నుంచి నవంబర్ 29 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు ‘రైతన్న- మీకోసం’ వారోత్సవాలు నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నేటి (నవంబర్ 24) నుండి 'రైతన్న మీకోసం' కార్యక్రమం ప్రారంభమవుతుంది. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు మొత్తం 7 రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ నెల 24 నుండి 29 వరకు వ్యవసాయ అధికారులు ప్రతి రైతు ఇంటికి స్వయంగా వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారికి పలు ముఖ్య సూచనలు చేయనున్నారు.
రైతులకు అవగాహన, పంటల మార్పిడి
వ్యవసాయ అధికారులు రైతులను సాంప్రదాయంగా వస్తున్న పంటల సాగును కాకుండా, నూతన, లాభదాయకమైన పంటల వైపు అడుగులు వేసేలా ప్రోత్సహించి, సిద్ధం చేయనున్నారు. మార్కెట్ ధరలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, దానికి అనుగుణంగా పంట మార్పిడి చేసుకునే విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. దీంతో పాటుగా, పంటల సాగులో ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించడం వంటి వాటిపై కూడా రైతులకు అవగాహన కల్పించనున్నారు.

సిబ్బంది, పంచ సూత్రాల అమలు
ఈ కార్యక్రమంలో భాగంగా, రైతు సేవ కేంద్రంలో పనిచేసే అగ్రికల్చర్ అసిస్టెంట్‌తో పాటు ఆరుగురు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వెళ్లి రైతుల సమాచారాన్ని సేకరిస్తారు. అలాగే, 'పంచ సూత్రాల' అమలుపై రైతులకు అధికారులు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ అధికారులను కూడా భాగస్వామ్యం చేసింది. ఈ అధికారులు ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా తగిన సూచనలు చేయనున్నారు.
ప్రతి మూడు కుటుంబాలను ఒక క్లస్టర్‌గా విభజించి.. ఒక్కొక్క బృందం రోజుకు 30 క్లస్టర్లు (90 గృహాలు) సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 24 నుంచి 29 వరకు అధికారుల బృందాలు రైతుల ఇళ్లకు వెళ్లి సీఎం సందేశ లేఖ, కరపత్రం అందజేస్తారు. ఏపీఏఐఎంఎస్ యాప్ వినియోగంపై అన్నదాతలకు అవగాహన కల్పిస్తారు. ఈ క్రమంలో రైతుల నుంచి సూచనలు, ఫిర్యాదులు అధికారులు స్వీకరిస్తారు.
రైతన్న మీకోసం కార్యక్రమం పూర్తయ్యాక నవంబర్ 30న సమావేశాలు నిర్వహిస్తారు. రైతుల ఇళ్లకు వెళ్లి వారి వద్ద నుంచి సేకరించిన ఫిర్యాదులు, సూచనలకు సంబంధించిన డేటాను సమీకరించి డిసెంబరు 2 వరకు విశ్లేషిస్తారు. డిసెంబర్ 3న 2026-27 సంవత్సరానికిగానూ కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేయడానికి ప్రతి రైతుసేవా కేంద్రంలో చర్యలు చేపట్టనున్నారు.
ముగింపు వర్క్‌షాప్
ఈ కార్యక్రమం ముగింపులో, డిసెంబర్ మూడవ తేదీన ప్రతి రైతు సేవ కేంద్రంలో వర్క్‌షాప్ నిర్వహించి, ఖరీఫ్, రబీ పంటల సాగుపై రైతులకు అవసరమైన సూచనలను అధికారులు చేయనున్నారు.






















