Amaravati Vision 2047: అమరావతి విజన్ 2047 రూపకల్పనలో ప్రజలకు అవకాశం ఇచ్చిన CRDA
Amaravati News | ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు సైతం భాగస్వాములై మీ ఆలోచనలతో అద్భుతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు అని సీఆర్‌డీఏ తెలిపింది.

AP Capital Amaravati | అమరావతి: ఏపీ రాజధాని అమరావతి రాజధాని ప్రాంతానికి ‘విజన్ 2047’ రూపకల్పనపై సీఆర్‌డీఏ కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏపీ సిఆర్డిఏ ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. దీని కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(CRDA) ‘విజన్ 2047’ రూపకల్పనలో భాగంగా సర్వేను నిర్వహిస్తోంది. భవిష్యత్తు తరాలకు ఉత్తమ, సుస్థిరమైన, ఆధునిక మౌలికవసతులతో కూడిన రాజధాని ప్రాంతంగా అమరావతిని అభివృద్ధి చేయేందుకు ప్రజల అభిప్రాయాలు, సూచనలు సిఆర్డిఏకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతం మొత్తంగా 8,600 చదరపు కిలోమీటర్ల పైగా విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతంలో కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు జిల్లాలకు చెందిన 56 మండలాలు, 900కు పైగా గ్రామాలతో పాటు విజయవాడ, గుంటూరు, అమరావతి, మంగళగిరి, తాడేపల్లి వంటి నగరాలు ఉన్నాయి.
అమరావతి ‘విజన్ 2047’ తయారీ ప్రక్రియలో భాగంగా ప్రజలు, ప్రజాసంఘాలు, నిపుణులు, వివిధ వర్గాలలోని విషయ నిపుణుల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను ఏపీ సిఆర్డిఏ సేకరిస్తోంది. ఈ సర్వేను ఇంగ్లీష్ & తెలుగులో పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది. ఇక్కడ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా, కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా లేదా సిఆర్డిఏ అధికారిక వెబ్‌సైట్ ద్వారా సర్వేలో పాల్గొని మీ విలువైన సలహాలు, సూచనలు ఇవ్వవచ్చు. సర్వేలో అభిప్రాయాలు, సూచనలు, సలహాలు పంపడానికి చివరి తేదీ 30 నవంబర్.

ఏపీ రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధిని ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, భవిష్యత్తు తరాలకు అత్యుత్తమ రాజధాని ప్రాంతాన్ని నిర్మించేందుకు, ప్రజలందరూ ఈ సర్వేలో పాల్గొనాలని ఏపీ సిఆర్డిఏ విజ్ఞప్తి చేసింది. మీ అభిప్రాయాన్ని నమోదు చేసేందుకు ఈ లింక్‌ను క్లిక్ చేయండి లేదా QR కోడ్‌ను స్కాన్ చేయండి:
లింక్ (సర్వే వివరాలుతెలుగులో): https://tinyurl.com/4razy6ku
Link (Survey Details in English): https://t.co/h7DnyblHIH
మీ ఆలోచనలతో అద్భుతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు, రాజధాని అమరావతి భవిష్యత్తు విజన్ రూపకల్పనలో మీరు సైతం భాగస్వాములు అవ్వాలని.. నిర్ణీత గడువులోగా అభిప్రాయాలను పంచుకోవాలని ఏపీ సిఆర్డిఏ కమిషనర్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఏపీ సిఆర్డీఏ),
కమిషనర్ కార్యాలయము, 5వ ఫ్లోర్, రాయపూడి పోస్ట్, తుళ్లూరు మండలం,
అమరావతి- 522237.






















