SOMASILA PROJECT: సోమశిల ఆప్రాన్ మరమ్మతు పనుల్లో మరో ముందడుగు..
సోమశిల ప్రాజెక్ట్ రక్షణ పనులకు సంబంధించిన ఫైల్ న్యాయ పరిశీలనకు వెళ్లింది. దెబ్బతిన్న జలాశయం కట్టడాలకు మరమ్మతులు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు.
సోమశిల ప్రాజెక్ట్ ఆప్రాన్ గతంలోనే పూర్తిగా ధ్వంసమైంది. ఈ క్రమంలో ఇటీవల వరదలకు ముందే నిపుణుల బృందం ఆప్రాన్ ప్రాంతాన్ని సందర్శించింది. మరమ్మతులకు పలు సూచనలు చేసింది. దీనికి సంంబధించి టెక్నికల్ కమిటీ అనుమతి కూడా వచ్చింది. అయితే ఇటీవల వర్షాలకు సోమశిల నిండుకుండలా మారడం.. భారీ ఎత్తున మూడు వారాలకు పైగా నీటిని వదిలిపెడుతూనే ఉండటంతో.. ఆప్రాన్ మరింతగా ధ్వంసమైంది. ఆప్రాన్ తోపాటు.. ఎడమ వరద రక్షణ కట్ట, పైలాన్, ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. సోమేశ్వర స్వామి ఆలయ గాలిగోపురం కూలిపోయింది. అక్కడ ఆలయంలో ఇతర నిర్మాణాలు కూడా దెబ్బతిన్నాయి. ఎస్బీఐ కార్యాలయం కూడా దెబ్బతిన్నది.
మొత్తమ్మీద వరదలు మిగిల్చిన విషాదాన్ని సోమశిల ఆప్రాన్ మరోసారి కళ్లకు కట్టింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ ఆప్రాన్ నిర్మాణానికి 150కోట్ల రూపాయలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆప్రాన్ మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అదే సమయంలో 100కోట్ల రూపాయలతో నెల్లూరు వద్ద పెన్నా నదికి బండ్ నిర్మించాలని కూడా సూచించారు. దీంతో ఆప్రాన్ మరమ్మతుల కార్యక్రమం మరోసారి తెరపైకి వచ్చింది.
తాజాగా సోమశిల ప్రాజెక్ట్ రక్షణ పనులకు సంబంధించిన ఫైల్ న్యాయ పరిశీలనకు వెళ్లింది. దెబ్బతిన్న జలాశయం కట్టడాలకు మరమ్మతులు చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రొక్యూర్‌మెంట్, రివర్స్ టెండరింగ్ పద్ధతిలో టెండర్లను ఆహ్వానిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో అంచనా ప్రకారం రూ. 117 కోట్ల విలువైన ఈ పనులను అతి త్వరలో మొదలు పెడతారు.
పాలనాపరమైన, సాంకేతిక అనుమతులు కూడా ఈ పనులకు లభించాయి. విజయవాడలో రాష్ట్ర స్థాయి టెక్నికల్ కమిటీ అనుమతి పూర్తవడంతో.. టెండరు పిలిచేందుకు ప్రస్తుతం ఈ ఫైల్ న్యాయ పరిశీలనకు వెళ్లింది. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ల్యాబొరేటరీలో మరమ్మతు నమూనాలు సిద్ధం చేశారు. ఇప్పుడు జ్యుడీషియల్ ప్రివ్యూ పూర్తయితే పనులు మొదలు పెట్టే అవకాశముంది. జ్యుడీషియల్ ప్రివ్యూ దశలో ఎవరికైనా అభ్యంతరాలుంటే ఆన్ లైన్ లో తెలపొచ్చని, ఆ అభ్యంతరాలను స్వీకరించి కమిటీ అనుమతులు మంజూరు చేస్తుందని తెలిపారు అధికారులు.
వరదలకంటే ముందే పని పూర్తి కావాలి..
ప్రస్తుతం సోమశిల ప్రాజెక్ట్ నిండుకుండలా ఉంది. ఆప్రాన్ తో సంబంధం లేకుండా రెండు గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే వరద మరీ ఎక్కువగా వస్తే మాత్రం మిగతా గేట్లను కూడా ఎత్తివేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆప్రాన్ పైనుంచే నీరు కిందకు వెళ్తుంది. అందుకే వీలైనంత త్వరగా మరమ్మతు పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని భావిస్తున్నారు అధికారులు. మరోసారి వరదలు వచ్చే లోపు పనులు పూర్తయితే ఆటంకం లేకుండా ఉంటుందని భావిస్తున్నారు.
Also Read: కట్టుకున్న భార్యపై భర్త ఘాతుకం.. వివస్త్రను చేసి, గొంతుకు తాడు బిగించి హత్య
Also Read: Warangal Crime: బెయిల్ పూచీకత్తు కోసం ఫోర్జరీ సంతకాలు... కోర్టులను మోసం చేస్తున్న ముఠా అరెస్టు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి