Nellore News : హ్యాట్రిక్ కు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న కోటంరెడ్డి, ఏప్రిల్ 11 నుంచి ప్రజాబాట
Nellore News : ఏప్రిల్ 11 నుంచి "జగనన్న మాట.. గడపగడపకు కోటంరెడ్డి బాట" నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. మొత్తం 30 రోజులపాటు తన నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్తానన్నారు
Nellore News : ఇటీవల జరిగిన వైసీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఇంటి తలుపు తట్టాలని, ప్రతి గడపా తొక్కాలని సూచించారు. తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరిస్తేనే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మన వెంట ఉంటారని చెప్పారు జగన్. ప్రభుత్వం ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా అంతిమంగా ఎమ్మెల్యేలు ప్రజల్లో ఉంటేనే విజయం సాధించగలమని అన్నారు. సీఎం జగన్ మాట ప్రకారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట మొదలు పెట్టారు.
అధికారంలోకి వచ్చాక మూడోసారి
2014 ఎన్నికలకు ముందు, 2019 ఎన్నికల సమయంలో కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజాబాట నిర్వహించారు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రెండు దఫాలు కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు మూడోసారి రూరల్ ఎమ్మెల్యే ప్రజాబాట పడుతున్నారు. ఏప్రిల్ 11న దీనికి మహూర్తంగా నిర్ణయించారు. ఏప్రిల్ 11 నుంచి "జగనన్న మాట.. గడపగడపకు కోటంరెడ్డి బాట" అనే పేరుతో ప్రజల్లోనే ఉండేందుకు తీర్మానించారు. మొత్తం 30 రోజులపాటు తన నియోజకవర్గంలో ప్రతి ఇంటి గడపా తొక్కాలని నిర్ణయించారు. ఆ 30 రోజులు తన ఇంటికి వెళ్లనని, కేవలం ప్రజల్లోనే ఉంటానని అంటున్నారాయన.
తిండి, నిద్ర అన్నీ కార్యకర్తల ఇళ్లలోనే
ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా ప్రజల ఇంటికి వెళ్లి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్న నెల్లూర రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు మరో విడత ప్రజాబాట మొదలు పెట్టారు. నెలరోజుల పాటు కార్యకర్తల ఇళ్లలోనే తిండి, నిద్ర ఉండేట్లు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. ప్రతి రోజూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ముందుకు కదులుతారు. సాయంత్రానికి వాటి పరిష్కారానికి ఓ కార్యాచరణ రూపొందిస్తారు.
హ్యాట్రిక్ కోసం సిద్ధం
2014, 2019లో వరుసగా రెండుసార్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచేందుకు రూట్ మ్యాప్ ఫిక్స్ చేశారు. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా స్థానికంగా ఆయనకు పేరుంది. ఆయనతోపాటు, ఆయన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కూడా రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రస్తుతం గిరిధర్ రెడ్డి వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. అన్నదమ్ములిద్దరికీ నెల్లూరు రూరల్ పై స్థానికంగా మంచి పట్టు ఉంది. ప్రతి గ్రామంలోనూ వైసీపీ కేడర్ ని పెంచుకుంటూ, చేరికలతో పార్టీని బలోపేతం చేస్తున్నారు కోటంరెడ్డి సోదరులు. జగన్ పిలుపుమేరకు మరో దఫా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి జనంలోకి వెళ్లబోతున్నారు.