Nellore e-Crop: మరోసారి నెల్లూరుకి టాప్ ప్లేస్.. ఈ-క్రాప్ లో రాష్ట్రంలోనే ఫస్ట్..
నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖకు ఈ-క్రాప్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచారు.
ఇటీవలే కొవిడ్ వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ లో రాష్ట్రంలోనే నెంబర్-1 స్థానంలో నిలిచింది నెల్లూరు జిల్లా. అర్హులైనవారందరికీ ఫస్ట్ డోస్ పూర్తి చేయడంలో 100 శాతం రిజల్ట్ చూపించింది. రాష్ట్రంలో 100 శాతం ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన ఏకైక జిల్లాగా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు మరో టాస్క్ లో కూడా నెల్లూరు జిల్లా అధికారులు రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ-క్రాప్ నమోదులో నెల్లూరు జిల్లాకు ఫస్ట్ ర్యాంక్ తెచ్చిపెట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా పంటల ఆన్ లైన్ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఏయే జిల్లాల్లో ఏ రైతు ఏ పంటను వేశారు, ఎంత విస్తీర్ణంలో వేశారు, సబ్సిడీలు ఏవైనా తీసుకున్నారా, కౌలు రైతా, యజమానా.. అనే వివరాలన్నీ అందులో ఉంటాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లు ఈ-క్రాప్ నమోదు చేస్తారు. ప్రభుత్వం నుంచి రైతులకు అందే సాయం అంతటికీ ఇదే ఆధారం. రైతు భరోసా కూడా ఈ-క్రాప్ ప్రాతిపదికన రైతుల ఖాతాల్లో పడుతుంది. క్రాప్ డ్యామేజీకి కూడా ఇదే మూలం. అందుకే ఈ-క్రాప్ నమోదుని కీలకంగా పరిగణిస్తారు. ఇలాంటి కీలక ఘట్టంలో నెల్లూరు జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది.
నెల్లూరు జిల్లా వ్యవసాయశాఖకు ఈ-క్రాప్ నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానం లభించింది. వరదలు, కరవు కాటకాల సమయంలో రైతులు నష్టపోకుండా ప్రభుత్వ సాయం అందించేందుకు ఈ-క్రాప్ ఎంతో ప్రాధాన్యంగా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచారు.
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఈ నెల 13 నాటికి 1,35,675 ఎకరాలకు ఈ-క్రాప్ నిర్వహించి.. వంద శాతం లక్ష్యాన్ని చేరుకున్నారు అధికారులు. ఈమేరకు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. వ్యవసాయ శాఖ అధికారులను ఆయన అభినందించారు. జిల్లా అధికారులు, మండల ఏవోలు, గ్రామ వ్యవసాయ సహాయకులకు అభినందనలు తెలిపారు. రబీ సీజన్‌లో ఇప్పటి వరకు 64096.66 ఎకరాలకు ఈ-క్రాప్ నమోదు చేసినట్లు తెలిపారు.
వర్షాల నష్టాలకు ఈ-క్రాప్ కీలకం..
ఇటీవల నెల్లూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. రైతుల నష్టం ప్రత్యక్షంగా కనపడుతున్నా కూడా నష్టపరిహారం అంచనాలకు మాత్రం ఆన్ లైన్ లెక్కలే కావాల్సి ఉంటుంది. దీంతో ఈ-క్రాప్ నమోదు ఇక్కడ కీలకంగా మారింది. వర్షాలకు 2917.47 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లడంతో కోటీ 85 లక్షల రూపాయల నష్టపరిహారానికి జిల్లా అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
ఈ-క్రాప్ నమోదులో జిల్లా యంత్రాంగం కృషికి తగిన ఫలితం లభించిందని, వందశాతం లక్ష్యాన్ని అందుకోవడంతో రాష్ట్రంలోనే తొలి స్థానం సాధించినట్టయింది.
Also Read: Nellore TDP: నెల్లూరు టీడీపీలో నాయకత్వ లేమి..కొంప ముంచుతున్నది అదే.. చంద్రబాబు ఫైర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి