Nara Lokesh: భిక్షాటన చేసే ఇద్దరు చిన్నారులకు స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించిన నారా లోకేష్
భిక్షాటన చేసే ఇద్దరు చిన్నారులకు నారా లోకేష్ స్కూల్ లో అడ్మిషన్ ఇప్పించారు.

నెల్లూరు లో 150 ఏళ్ల చారిత్రిక వీఆర్ స్కూల్ ను మంత్రి నారాయణ చొరవ తో 15 కోట్ల తో డెవలప్ చేసి పునః ప్రారంభించారు. దీనిని ప్రారంభించిన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ముందుగా.. పాఠశాలలో తమకు చదువు చెప్పించాలని గత శనివారం కమిషనర్ ను అభ్యర్థించిన ఇద్దరు చిన్నారులు సీహెచ్ పెంచలయ్య, వి.వెంకటేశ్వర్లకు తన చేతుల మీదుగా అడ్మిషన్ ఫాంలు ఏవో వెంకటరమణకు అందజేశారు. చిన్నారుల విద్యాభ్యాసానికి అండగా నిలుస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. చిన్నారులు కష్టపడి బాగా చదువుకోవాలని, భవిష్యత్ లో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. వారికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
పాఠశాల మొత్తం తిరిగి విద్యార్థులను ఉత్సాహపరిచిన మంత్రి లోకేష్
అత్యాధునిక వసతులతో ఏర్పాటుచేసిన వీఆర్ మున్సిపల్ హైస్కూల్ తరగతి గదులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియతిరిగి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఉత్సాహపరిచారు. యాక్టివిటీ రూమ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, హైడ్రోపోనిక్స్ ల్యాబ్, రోబోటిక్ లాబ్, లైబ్రరీ, డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్ లు పరిశీలించారు. ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరితో ఫోటోలు దిగారు. అనంతరం ఆధునిక సదుపాయాలతో ఏర్పాటుచేసిన పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. క్రికెట్, వాలీ బాల్ ఆడి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఏకైక సాధనం
పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ఒక్కటే ఏకైక సాధనం అని ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రపంచాన్ని విద్య ఏ రకంగా మారుస్తుందని ఏడో తరగితి చదివే పర్నీక్ సాయి ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ను ప్రశ్నించారు. ఇందుకు మంత్రి సమాధానం ఇస్తూ.. మంచి ప్రశ్న అడిగావు. పేదరికం నుంచి బయటపడాలంటే విద్య ద్వారానే సాధ్యం. చదువు ద్వారానే ఉన్నతస్థానానికి వెళ్లగలం. ఎడ్యుకేషన్, ఇమ్మిగ్రేషన్ బలమైన సాధనాలు. నువ్వు కంపెనీ ప్రారంభించి పది మందికి ఉద్యోగాలు కల్పించాలని పర్నీక్ సాయిని ఉత్సాహపరిచారు.






















