Minister Kakani On Corut Theft Case: ఎలాంటి విచారణకైనా సిద్ధమే- నెల్లూరు కోర్టులో దొంగతనం కేసుపై మంత్రి కాకాణి రియాక్షన్
నెల్లూరు కోర్టులో దొంగతనం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. తానంటే గిట్టనివారు తనపై బురదజల్లడానికి తనను ఆ దొంగతనం కేసుతో ముడిపెడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
నెల్లూరు కోర్టులో దొంగతనం వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. కేసు పూర్వాపరాలు చెబుతూనే.. తానంటే గిట్టనివారు తనపై బురదజల్లడానికి తనను ఆ దొంగతనం కేసుతో ముడిపెడుతూ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
2017లో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై కేసు పెట్టారని చెప్పారు. ఆ తర్వాత రెండేళ్లపాటు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కూడా కోర్టులో చార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయారని అన్నారు. ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు చెప్పిందని, చార్జ్ షీట్ ని మూడు సార్లు రిటర్న్ చేసిందని గుర్తు చేసారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. చార్జి షీట్ ఫైల్ అయిందని చెప్పారు.
పేపర్లు అలా వెదజల్లుతారా..?
కోర్టులో దొంగతనం కేసు గురించి ఇప్పటికే ఎస్పీ అన్ని వివరాలు చెప్పారని అన్నారు మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. సాక్ష్యాలు మాయం చేయాలనే ఉద్దేశం ఉన్నవారైతే.. కోర్టులోనుంచి బ్యాగ్ బయటకు తీసుకొచ్చి, కాగితాలు మాత్రం కోర్టులో చల్లి వెళ్లిపోతారా అని ప్రశ్నించారు. పేపర్లు ఏవైనా ఉంటే ప్రతిపక్షాల ఇంటి ముందు చల్లిపోతారా అని అడిగారు. ఎవరైనా దొంగతనం చేస్తే విలువైనవి తీసుకెళ్తారని, అవసరం లేనివి అక్కడే వదిలేస్తారని, ఈ దొంగతనం కేసులో కూడా అదే జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం దొంగతనం జరిగిన తర్వాత తన జోక్యం ఉందని నిందలు వేస్తున్నారని అన్నారు కాకాణి. మంత్రి అయితేనే దొంగల్ని పురమాయిస్తారా..? ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దొంగలు దొరకరా..? అని ప్రశ్నించారు. తనకు మంత్రి పదవి రాదు అనే ప్రచారం కూడా జరిగిందని, పదవి వచ్చిన తర్వాత ఇలా ఆ దొంగతనంలో తన ప్రమేయం ఉందని తప్పుడు ప్రచారం జరిగిందని చెప్పారు కాకాణి.
సీబీఐ ఎంక్వయిరీ కోరచ్చు కదా..?
ప్రతిపక్షాలకు ఇంకా అనుమానం ఉంటే, తమ వాదనే నిజమనే ధైర్యం ఉంటే.. హైకోర్టుకి వెళ్లి సీబీఐ ఎంక్వయిరీ కోరచ్చు కదా అని ప్రశ్నించారు మంత్రి కాకాణి. టీడీపీ నాయకులకు తనపై బురదజల్లాలనే ఉద్దేశం ఉందని అన్నారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే, అపోహలు తొలగిపోవాలంటే సీబీఐ ఎంక్వయిరీ కోరాలని టీడీపీ నాయకులకు సలహా ఇచ్చారు కాకాణి.
ఇక తన విల్లాలో ఎలక్ట్రీషియన్ చనిపోయాడనే వార్తపై కూడా కాకాణి స్పందించారు. విచిత్రంగా ఆ ఎలక్ట్రీషియన్ కి, నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనానికి కూడా సంబంధం ఉందని పత్రికల్లో రాశారని చెప్పారు. ఎలక్ట్రీషియన్ చనిపోయిన సమయంలో తాను అనంతపురంలో ఉన్నానని స్పష్టం చేశారు కాకాణి. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో అంతా తేలిపోతుంది కదా అని ప్రశ్నించారు. అన్నిటికీ తనపై బురదజల్లాలని అనుకోవడం సరికాదన్నారు కాకాణి.